నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నివాసాలలో ఏసీబీ సోదాలు.!
Published on: Tue Sep 22, 2026 3:20PM

ప్రముఖ వైద్య సంస్థ నిమ్స్‌కు చెందిన అధికారి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం (సెప్టెంబర్ 21) ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులపై అందిన సమాచారం మేరకు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగి సోదాలు చేపట్టాయి. నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు జరుగుతుండటం వైద్య వర్గాల్లో సంచలనం రేపింది.
రాజధాని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గల డాక్టర్ లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. మొత్తం 13 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఆయన ప్రధాన నివాసంతో పాటు, బంధువులు, కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

ఈ సోదాల సమయంలో ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడుల వివరాలతో పాటు ఇతర కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. డాక్టర్ లక్ష్మీభాస్కర్ గత రెండు దశాబ్దాలుగా నిమ్స్ ఆసుపత్రిలో వివిధ హోదాల్లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గతంలో కూడా డాక్టక: నోరి లక్ష్మీ భాస్కర్ పై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఈ సోదాల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సోదాలు ముగిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
[ACB Raids, NIMS Deputy Superintendent, Dr Nori Lakshmi Bhaskar, Hyderabad, Anti Corruption Bureau, Telangana News, Telugu One]


