TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడ మేయర్ ఎన్నిక: డిపాజిట్ కోల్పోయిన ఏబీవీ.. ఒటమి ఒప్పుకోలు.. అంతలోనే కుట్ర ఆరోపణలు.!

Published on: Fri Nov 6, 2026 11:54AM

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఏబీ వెంకటేశ్వరరావు తొలుత హుందాగా ఓటమిని అంగీకరించారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో.. తన ఓటమి వెనుక కుట్ర ఉందంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 

దీంతో ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటీ చేసిన విజయవాడ మేయర్ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.   నిజాయితీ పరుడిగా, మేధావిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు తొలుత ఓటమిని హుందాగా అంగీకరించారు. కానీ 24 గంటలు తిరగక ముందే తనను ఓడించేందుకు కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ మేయర్ ఎన్నికలో ఓటమి పాలైనా తాను రాజకీయాల నుంచి వైదొలగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.  కొందరు కావాలనే తనపై కుట్ర పన్ని ఓడించారని ఆరోపించిన ఆయన, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను పట్టించుకోనన్నారు.

విజయవాడ మేయర్ ఎన్నికలలో ఏబీవీ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినప్పటి నుంచే ఆయన పోటీలో నిలవడం.. వైసీపీకి మేలు చేయడానికేనా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో వేధింపులకు గురైన ఆయన విజయవాడ మేయర్ అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలోకి దిగడం వల్ల తెలుగుదేశం కూటమి ఓట్లు చీలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, దీని వల్ల ఏబీవీకి గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేకపోయినా, వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఏబీవీ పోటీ వల్ల తెలుగుదేశం కూటమి ఓట్లు చీలలేదని తేటతెల్లమైంది. దీంతో సోషల్ మీడియాలో ఏబీవీపై ఓ రేంజ్ లో విమర్శలు సెటైర్లు వెల్లువెత్తాయి. 

 ఈ నేపథ్యంలోనే ఏబీవీ స్ట్రాంగ్ గా స్పందించారు. తన ఓటమికి కొందరు కుట్రపన్నారని ఆరోపించడంతో   ఆగకుండా తాను ఓటమి పాలు కాలేదనీ,  కొందరు తనను కావాలనే ఓడించారన్నారు.  తనను నమ్మి ఓటు వేసిన 12 వేల మంది ప్రజల నమ్మకమే తనకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. తన పరువు పోయిందని కొందరు సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: విజయవాడ మేయర్ ఎన్నికలో ఘోర పరాజయం: ఏబీవీ పొలిటికల్ ఎంట్రీపై నీలినీడలు.!

విజయవాడ మేయర్ స్థానానికి పోటీ చేసినప్పుడు తాను కేవలం పదవి కోసం పాకులాడలేదని, ప్రజా సమస్యలపై గళం విప్పడమే తన ధ్యేయమని ఏబీవీ తెలిపారు. ముఖ్యంగా బుడమేరు సమస్యపై నిలదీయడం, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాలను ప్రశ్నించడం తన బాధ్యతగా భావించానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ లబ్ది కోసం కాకుండా ప్రజాక్షేమం కోసమే చేశానని స్పష్టం చేశారు.

తనను రాజకీయాలకు దూరం చేయాలని, తన నుంచి మద్దతుదారులను  వేరు చేయాలని చూస్తున్న శక్తుల ప్రయత్నాలు నెరవేరవని ఏబీవీ హెచ్చరించారు.అ హేళనలతో, బురదజల్లే ప్రచారాలతో తనను వెనక్కి తగ్గించగలమని భావిస్తే వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నట్లేనన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల గొంతుకగా మారుతానని ఏబీవీ కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది.  

మీకు నచ్చవచ్చు:  ఏపీ పుర ఫలితాల్లో కూటమి హవా: వైసీపీ కుదేలు.!

కుప్పంలో టీడీపీ ప్రభంజనం..32కు 32 వార్డులు కైవసం.!

[AB Venkateswara Rao Sensational Comments on Defeat,  Vijayawada Mayor Elections, Conspiracy,  AP politics, Telugu One]