అసహనంపై అమీర్ ఖాన్.. దేశం విడిచి వెళదామనుకున్నాం..

దేశంలో పెరుగుతున్న అసహనంపై ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ నాథ్ గోయంకా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మత అసహనంపై మాట్లాడారు. దేశంలో ఈ మధ్య కాలంలో అసహనం పెరిగిందని.. దాని ప్రభావం తన కుటుంబం మీద కూడా పడిందని.. ఈనేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో తన భార్య కిరణ్ రావ్ కూడా దేశం విడిచి వెళదామన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాదు అసహనం వల్ల తాను చాలా ఆందోళనకు.. అభద్రతాభావానికి కూడా లోనయ్యానని అన్నారు.

పనిలో పనిగా రాజకీయ నేతలపై కూడా మండిపడ్డారు అమీర్ ఖాన్. కేంద్ర నాయకులు కావచ్చు.. రాష్ట్ర నాయకులు కావచ్చు.. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై కఠిన వైఖరి తీసుకోవాలని భావిస్తాం.. ఘాటైన ప్రకటన చేస్తాం. న్యాయ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇలాంటివి జరగనప్పుడు దేవంలో అభద్రతా భావం ఉందని భావిస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అమీర్ ఖాన్ కూడా అసహనంపై నోరు విప్పారు.