ఆధార్ వ్యవస్థనే కన్ఫ్యూజ్ చేసిన కవలలు.. వేలి ముద్రలు, ఐరిస్ సేమ్ టూ సేమ్.!
Published on: Tue Sep 29, 2026 3:52PM

కవలలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండటం కద్దు. ఇద్దరూ పక్కపక్కనే నిలబడితే ఒక్కో సారి వారి తల్లిదండ్రులు కూడా ఎవరు ఎవరో గుర్తించలేక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటి కవలల కధాంశంతో బోలెడు సినిమాలు కూడా వచ్చాయి. రూపం ఒకేలా ఉన్నా.. వేలి ముద్రలు, ఇరిస్ పరీక్షల ద్వారా ఎవరు ఎవరన్నది శాస్త్రీయంగా తేల్చేయగలుగుతాం. ఎందుకంటే ఎంత కవలలైనా వేలిముద్రలు, ఇరిస్ గుర్తింపు ఒకేలా ఉండవు. అలా ఉండటం అసాధ్యం అన్న నమ్మకం ఇటీవలి కాలం వరకూ చాలా చాలా బలంగా ఉండేది.
ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే ఆధార్ సాంకేతిక వ్యవస్థ పునాదులు నిలబడ్డాయి.
అందుకే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆధార్ గుర్తింపు కీలకంగా మారింది. అటువంటి ఆధార్ సాంకేతిక వ్యవస్థ అస్థిత్వాన్నే ప్రశ్నించారా కవలలు. సాధారణంగా కవలల రూపం ఒకేలా ఉన్నప్పటికీ, వారి వేలిముద్రలు లేదా కంటి ఐరిస్ నమూనాలలో క తేడాలు ఉంటాయి. అవి ఏ ఇద్దరిలోనూ ఒకేలా ఉండవు అన్నది శాస్త్రీయంగా ధృవీకరణ పొందిన సత్యం. అయితే ఆ కవలల విషయంలో ఆ శాస్త్రీయ ధృవీకరణ తప్పింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతానికి చెందిన ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ అనే కవల అక్కాచెల్లెళ్లు టెన్త్ చదువుతున్నారు. వీరు తమ పాఠశాల తరఫున పదో తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్ కేంద్రంలో నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఒకరి వివరాలను సిస్టమ్‌లో అప్‌డేట్ చేయగా, ఆ వెంటనే రెండో సోదరి తన డేటాను నమోదు చేసే సమయంలో టెక్నాలజీ వ్యవస్థ చేతులెత్తేసింది.
ఆధార్ సాంకేతిక సాఫ్ట్‌వేర్ రెండో విద్యార్థిని వివరాలను సరికొత్త ప్రవేశంగా గుర్తించకుండా, డూప్లికేట్ ఎంట్రీగా తిరస్కరించింది. వారి వేలిముద్రలతో పాటు కంటి ఐరిస్ నమానాలు కూడా సేమ్ టూ సేమ్ ఉండటమే ఇందుకు కారణం. ఇదే విషయాన్ని నిపుణులు సైతం గుర్తించి ధృవీకరించారు. ఈ కారణం చేత బోర్డు పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోవడంతో ఆ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నిర్ణీత గడువులోగా పరీక్షలకు రిజిస్టర్ కాకపోతే తమ పిల్లల విద్యా సంవత్సరం, భవిష్యత్తు నాశనమౌతుందని ఆ కవలల తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు.
నభూతో అన్న చందంగా ఎదురైన ఈ సమస్య పరిష్కారం కోసం వారు జిల్లా కలెక్టరేట్ ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విషయాన్ని నేరుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రధాన కార్యాలయానికి నివేదించారు.
దీంతో ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. సాధారణ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈ చిక్కుముడి వీడకపోవడంతో అధికారులు మాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. ప్రత్యేక నిబంధనలు, సాంకేతిక మార్పులను ఉపయోగించి ఆ కవల సోదరీమణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విడివిడిగా ప్రత్యేక ఆధార్ గుర్తింపు సంఖ్యలను కేటాయించి సమస్యను పరిష్కరించారు.
[Aadhaar Biometric, Twin Sisters Aadhaar Problem, UIDAI Manual Verification, Rampur Twins, Finger Prints, IRIS, Same To Same, Aadhaar System Confused]


