షీ ప్లే.. బాలికల్లో క్రీడా వికాసానికి కీలక ముందడుగు.!
Published on: Mon Aug 24, 2026 11:31AM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు, అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షీ ప్లే విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. విశాఖపట్నంలోని మధురవాడ పరిధిలో ఉన్న చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరున్నర కోట్ల రూపాయల భారీ వ్యయంతో దివీస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ చంద్ర నిధులతో ఆధునీకరించిన క్లాస్‌రూమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్.. సాధారణంగా పాఠశాల స్థాయిలో బాలికలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయనీ, సమాజం నుంచీ, కుటుంబం నుంచీ పెద్దగా ప్రోత్సాహం ఉండదనీ, అలాగే పాఠశాలల్లో క్రీడా వసతులు అందుబాటులో ఉ:డకపోవడంతో ప్రతిభావంతులైన బాలికలు వెనకబడిపోతున్నారన్నారు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడంతో పాటు బాలికలకు విస్తృతమైన అవకాశాలు కల్పించడమే షీ ప్లే' విధానం లక్ష్యమని చెప్పారు.
ఈ సందర్భంగా తెలుగు క్రీడాకారిణి, క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి సాధించిన ఘనతను మంత్రి ఉదాహరించారు. ప్రారంభంలో ఆమె క్రీడల్లోకి రావడంపై కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఆమె పట్టుదలను చూసి వారు మద్దతుగా నిలిచారని, సరైన ప్రోత్సాహం అందిస్తే మన ఆడబిడ్డలు ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉంటారని శ్రీచరణి నిరూపించారన్నారు.
అలాగే చంద్రంపాలెం స్కూల్ నుంచే ఇద్దరు విద్యార్థినులు ఇప్పటికే బాస్కెట్‌బాల్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. విద్యార్థినులతో కలిసి వాలీబాల్ ఆడారు.
A key step forward for sports development among girls, She Play, Policy, Minister, Nara Lokesh


