అందమైన జీవితం.. బంగారం లాంటి భార్యాభర్తల బంధానికి మూలస్థంబాలు ఇవే..!
Published on: Wed Sep 16, 2026 6:14PM
అందమైన జీవితం.. బంగారం లాంటి భార్యాభర్తల బంధానికి మూలస్థంబాలు ఇవే..!

ప్రపంచంలో అపురూపమైన బంధాలలో వైవాహిక బంధం ఎంతో ప్రత్యేకమైనది. వివైవాహిక జీవితంలో కొంతకాలం గడిచాక చాలామంది దంపతులు తమ భాగస్వామితో చిన్నపాటి అసంతృప్తులు, నిరాశలను ఎదుర్కొంటూ ఉంటారు. అలవాట్లు, అభిరుచులు, కుటుంబ బంధాలు, ప్రయాణాలు లేదా ఇష్టాయిష్టాల విషయంలో విభేదాలు రావడం సహజం. అయితే ఇటువంటి వ్యత్యాసాలు రాగానే బంధం విఫలమైందని లేదా సరైన భాగస్వామి దొరకలేదని అనుకోవడం పొరపాటు. నిజానికి, మనం ఒక బంధం నుంచి ఏమేమి ఆశించాలి అనే విషయంలో అనవసరమైన పిచ్చి ఆలోచనలను పెంచుకోవడమే దీనికి ప్రధాన కారణం.
సాధారణంగా పెద్దల నుండి సమాజంలోని ఎంతో మంది దంపతులంటే ప్రతి విషయంలోనూ ఒకేలా ఉండాలని, ఒకే ఆలోచనలు కలిగి ఉండాలని, ప్రతి క్షణం కలిసి గడపాలని చెబుతూ ఉంటారు.భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ ఇలాంటి అంచనాలు ఎదుటి మనిషిపై ఒత్తిడి పెంచుతాయి. నిజంగా సంతోషాన్ని ఇచ్చే బంధంలో ఇవన్నీ అవసరం లేదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. దంపతుల మధ్య బంధం బలంగా, ఆనందంగా ఉండటానికి ప్రధానంగా మూడు మూలస్థంబాలు అవసరం. అవేంటో తెలుసుకుంటే..
దయ, ఓర్పు..
మనలోని లోపాలను, బలహీనతలను సహృదయంతో అర్థం చేసుకుంటూ, మంచి మనసుతో స్వీకరించే భాగస్వామి లభించడం ఎంతో ముఖ్యం. మన అసలైన స్వభావాన్ని ఎలాంటి విమర్శలు లేకుండా అంగీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు బంధంలో ప్రశాంతత ఉంటుంది.
మానసికంగా దగ్గర కావడం..బలాన్ని, బలహీనతను పంచుకోవడం..
సమాజం ముందు మనం ఎంత దృఢంగా నటించినా, భాగస్వామి ముందు మాత్రం మన భయాలు, ఆందోళనలు, బలహీనతలను ధైర్యంగా పంచుకోగలగాలి. ఎదుటివారి ముందు ఎలాంటి ముసుగు లేకుండా నిజాయితీగా ఉండగలగడం, అలాగే భాగస్వామి బలహీనతలను కూడా గౌరవించడం బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.
అర్థం చేసుకునే తత్వం..
మన ఆలోచనా శైలి, మన ఆసక్తులు, మన మనసులోని అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపడం , ఎదుటివారి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించడం అత్యంత అవసరం.
ఈ మూడు దంపతుల మధ్య ఉన్నప్పుడు, రోజువారీ విషయాల్లో ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ ఆ బంధం ఆనందంగా సాగుతుంది. అభిరుచులు, అలవాట్లు, సోషల్ సర్కిల్ ఒకేలా ఉన్నంత మాత్రాన మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పలేం. ఒకరికొకరు దయతో ఉంటూ, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఆసరాగా నిలిచినప్పుడు మాత్రమే బంగారం లాంటి జీవితం సాధ్యమవుతుంది.
•రూపశ్రీ.


