8వ వేతన సంఘం: బెంగళూరు భేటీలో ఉద్యోగ సంఘాల డిమాండ్లేంటంటే.?
Published on: Tue Oct 6, 2026 10:20AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం బుధ, గురు వారాల్లో (అక్టోబర్7, 8) ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బెంగళూరులో భేటీ కానుంది. ఈ భేటీలో వేతన సవరణ, ఫిట్‌మెంట్ర్, అలవెన్సులు, పెన్షన్ తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి.
8వ కేంద్ర వేతన సంఘాన్ని 2025 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ కమిషన్కి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్ కాగా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. కమిషన్‌కు తన సిఫార్సులను సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంది.
బెంగళూరు భేటీ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఇప్పటికే కమిషన్‌కు సమర్పించాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (ఐఆర్టీఎస్ఏ) కనీస వేతనాన్ని 52 వేల600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన నిర్మాణాన్ని సమీక్షించి ఉద్యోగుల బాధ్యతలు, పని పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కనీస వేతనాన్ని నిర్ధారించాలని కోరుతోంది.
ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఫిట్‌మెంట్ కీలక అంశంగా ఉంది. ఐఈర్టీఎస్ఏ వివిధ పే లెవల్స్‌కు వేర్వేరు ఫిట్‌మెంట్ లను ప్రతిపాదించింది. లెవెల్స్ 1–5కు 2.92, లెవెల్స్ 6–8కు 3.50, లెవెల్స్ 9–12కు 3.80, లెవెల్స్ 13–16కు 4.09, లెవెల్స్ 17–18కు 4.38 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరినట్లు తెలుస్తోంది.

అలాగే, వేతన నిర్మాణంతో పాటు ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్‌ను ఐదు శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి. అదే విధంగా జూనియర్ ఇంజినీర్లు, సీనియర్ సెక్షన్ ఇంజినీర్లకు కెరీర్ ప్రోగ్రెషన్, ప్రమోషన్లు, ఎమ్ఏసీపీఎస్ లో మార్పులు చేయాలని కోరుతున్నాయి. నైట్ షిఫ్ట్, ఓవర్‌టైమ్, రిస్క్, పనులకు సంబంధించిన అలవెన్సులను కూడా పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇక పోతే పెన్షనర్లకు సంబంధించిన అంశాలు కూడా బెంగళూరు భేటీలో ప్రముఖంగా ప్రస్తావనకు రానున్నాయి. రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రాథమిక వేతనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడేలా చూడాలని కోరుతోంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అలవెన్సులను కాలానుగుణంగా సవరించాలని, పెన్షనర్లకు ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నది.
[8th Pay Commission, Central Government Employees, Fitment Factor, Minimum Pay, Pension, Salary Hike, Bengaluru Pay Commission Meeting, Telugu One]


