ఈ 7 రకాల వ్యక్తులు చదువుకున్నా కూడా మూర్ఖులు గానే మిగిలిపోతారు..
Published on: Mon Oct 26, 2026 10:23AM
ఈ 7 రకాల వ్యక్తులు చదువుకున్నా కూడా మూర్ఖులు గానే మిగిలిపోతారు..

విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది. కులం, వర్గంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. ఇప్పట్లో అయితే ఎక్కువ శాతం మంది గ్రాడ్యుయేట్ లు, ఇంజనీరింగ్ చేసినవారు, పెద్ద పెద్ద చదువులే చదువుతున్నారు. అయితే చదువు అనేది మనిషికి ఉద్యోగాన్ని, సంపాదనను తెచ్చిపెడుతుందేమో కానీ.. వివేకవంతుడిగా ఉంచలేదని అంటున్నారు ఆచార్య చాణక్యుడు. ఎంత చదువుకున్నా సరే.. 7 రకాల వ్యక్తులు మూర్ఖులు గానే ఉండిపోతారట. ఆ వ్యక్తులు ఎవరో.. ఎందుకు మూర్ఖులుగా ఉండిపోతారో వివరంగా తెలుసుకుంటే..
తెలివి తేటలు..
వినగల, అర్థం చేసుకోగల, ఆలోచించగల సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే విద్య సహాయపడుతుంది. తెలివి తేటలు ఉన్నవారు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని వినగలరు, వారు ఆలోచించి అర్థం చేసుకోగలరు. కానీ తెలివితేటలు లేనివారు విద్య నుండి జ్ఞానాన్ని పొందలేరు.
నేర్చుకోవాలనే కోరిక..
మనిషికి నేర్చుకోవాలనే కోరిక ఉంటేనే ఏదైనా నేర్చుకోవడం సాధ్యమవుతుంది, దాని వల్ల ప్రయోజనం కూడా చేకూరుతుంది. దీనికి వయసుతో సంబందం లేదు కూడా. కానీ నేర్చుకోవాలనే ఆసక్తి లేనివారు విద్య వల్ల ప్రయోజనం పొందలేరు. ఎందుకంటే వారికి నేర్చిన విద్య విలువ అర్థం కాదు.. దాన్ని ఉపయోగించడం కూడా తెలియదు.
అన్వయించుకోవడం..
నేర్చుకున్న విద్యను జీవితంలో అన్వయించకపోతే అది నిరుపయోగంగా మారుతుంది. విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా, నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టడం ద్వారా కూడా.. దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
క్రమశిక్షణ..
చదువులో క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం చాలా అవసరం. క్రమశిక్షణ వల్ల చదువు మీద గౌరవం, దాని విలువ పెరుగుతాయి. ఆత్మనిగ్రహం వల్ల చదువుకున్న విషయాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని జీవితానికి అన్వయించుకోవడం అలవాటు అవుతుంది. చదువు నుండి ధ్యాస పక్కకు జరగదు. ఈ గుణాలు లేకుండా ఎంత చదివినా.. ఆ చదువు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
సమయం..
తప్పుడు వ్యక్తులతో సమయం గడపడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందని చాణక్యుడు చెబుతాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ఎదురయ్యే సమస్యలు వ్యక్తిని నిజమైన జ్ఞానానికి దూరం చేస్తాయి.
డబ్బు, జ్ఞానం..
డబ్బు, జ్ఞానం రెండింటినీ బాలెన్స్డ్ గా సంపాదించాలి. కేవలం డబ్బుపైనే దృష్టి సారించేవారు జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే కేవలం జ్ఞానం మాత్రమే కావాలని అనుకునేవాడు నేటికాలంలో బ్రతకడం దుర్బరమవుతుంది. అందుకే డబ్బు, జ్ఞానం రెండూ ఉండాలి.
నిజమైన జ్ఞానం..
ఆచార్య చాణక్యుని ప్రకారం.. చదవడం వల్ల జ్ఞానం రాదు. నిజమైన జ్ఞానానికి, విజ్ఞానానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి మధ్య బాలెన్స్ కాపాడుకోవడం చాలా అవసరం.
మంచి స్నేహం..
జ్ఞానం సంపాదించాలంటే విద్య నేర్చుకోవడం అవసరమే.. కానీ కేవలం విద్యతో జ్ఞానాన్ని సంపాదించడం కుదరదు. ఆలోచించే సామర్థ్యం, మంచి చెడు గురించి ఆలోచించే విచక్షణా సామర్థ్యం.. అవగాహన.. క్రమశిక్షణ.. అన్నింటికి మించి జ్ఞానాన్ని సంపాదించడానికి మంచి సహకారం అందించే మంచి స్నేహితులు కూడా ఎంతో అవసరం.
*రూపశ్రీ.


