మంగినపూడి విజయగణపతి వరల్డ్ రికార్డ్.!
Published on: Tue Sep 22, 2026 2:32PM

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నగరమైన మచిలీపట్నంలో ప్రతిష్టించిన భారీ వినాయక విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఈ గణనాథుని ప్రతిమ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. బందరులోని మంగినపూడి సముద్ర తీరంలో కొలువుదీరిన ఈ గణేషుని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు.
పర్యావరణ హితంగా అ నిర్వాహకులు ఈ మహా ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్థానికంగా సుమారు లక్ష ఇళ్ల నుంచి మట్టిని సేకరించి, భారీ స్థాయిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అరవై మూడు అడుగుల ఎత్తుతో రూపొందిన ఈ ఎకో ఫ్రెండ్లీ విజయ గణపతి విగ్రహం ఆకట్టుకుంటోంది. కేవలం ఎత్తు పరంగానే కాకుండా, ఈ విగ్రహం చేతిలో అమర్చిన 630 కిలోల లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక స్వీట్ హౌస్ నిపుణుల బృందం ఈ లడ్డూను తయారు చేసింది.

ఈ మహా విగ్రహ రూపకల్పన వెనుక శిల్పుల కఠిన శ్రమ దాగి ఉంది. దాదాపు మూడు నెలల పాటు శ్రమించి, సముద్ర తీరంలో ఈ కళాఖండాన్ని విగ్రహం పూర్తి కాగానే ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించి, దీనికి అధికారికంగా అంతర్జాతీయ రికార్డును ప్రకటించారు. ఈ రికార్డుకు సంబంధించిన ధృవపత్రాన్ని సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు అందజేశారు.
ఈ ఘనతను బందరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ వేదిక వద్ద వైభవంగా పూజలు, హోమాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, సముద్ర అలల హోరు మధ్య మంగినపూడి తీరం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. గత కొన్ని రోజులుగా సుమారు మూడున్నర లక్షలకు పైగా భక్తులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. విగ్రహ దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రసాద వితరణ సజావుగా జరిగేలా వాలంటీర్లు సేవలందిస్తున్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు కేవలం ఒక్కరి కృషి కాదని, భక్తులు, శిల్పులు, కమిటీ సభ్యులు అందరి సమష్టి కృషిగా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
[63 feet eco friendly ganesh, machilipatnam vijaya ganapathi, manginapudi beach ganesh idol, international achievers book of records, kollu ravindra, Telugu One]


