తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల ప్రసాదాల నైవేద్యం..!
Published on: Fri Sep 11, 2026 3:48PM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు నైవేద్య ప్రియుడు. స్వామివారికి ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ప్రత్యేక నైవేద్యాలను శాస్త్రోక్తంగా సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అన్నప్రసాదాలు, పిండి వంటలు, తీపి పదార్థాలు ఇలా రోజంతా వివిధ రకాల నైవేద్యాలతో శ్రీవారికి కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీవారికి నిత్యం ఏకంగా 45 రకాల ప్రసాదాలను నివేదిస్తారు. వీటిలో 20 రకాల అన్న ప్రసాదాలు, 25 రకాల పణ్యారములు ఉంటాయి. ఉదయం నైవేద్యం నుంచి రాజభోగం, రాత్రి శయన భోగం వరకు ఆయా సమయాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రసాదాలను స్వామివారికి సమర్పి స్తారు.

తిరుమల ఆలయం లో నైవేద్యాలకు ప్రత్యేక మైన వైఖానస ఆగమ సంప్రదాయాలు ఉన్నాయి. ఆలయ పోటులో నైవేద్య పదార్థాలను అత్యంత పవిత్రతతో, సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు. పదార్థాల ఎంపిక నుంచి పాత్రలు, వంట విధానం వరకు ప్రతి అంశానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. శ్రీవారి నైవేద్యాల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఉపయోగించకుండా నల్లమిరియాలను వినియో గించడం ప్రాచీన సంప్రదా యంగా కొనసాగుతోంది. భక్తులు పులిహోరగా పిలుచుకునే ప్రసాదాన్ని వైఖానస పరిభాషలో ‘తింత్రిణీరసాన్నం’, నెయ్యి పొంగలిని ‘ముద్గాన్నం’, బెల్లం అన్నాన్ని ‘గుడాన్నం’, మిరియాల అన్నాన్ని ‘మరీచ్యాన్నం’, వడను ‘మాషాపూపం’, దోశను ‘చక్రప్పం’ అని పిలుస్తారు.

ఆలయంలో మొదటి గంట అనంతరం స్వామివారికి ఉదయం నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో మాత్రాన్నం, ముద్గాన్నం (నెయ్యి పొంగలి), తింత్రిణీరసాన్నం (పులిహోర), దధ్యోదనం (పెరుగన్నం), గుడాన్నం (బెల్లం అన్నం/చక్ర పొంగలి), శాకాన్నం (కదంబం అన్నం), శర్కరాన్నం (రవ్వకేసరి) వంటి ప్రసాదాలను నివేదిస్తారు. అదే సమయంలో నాలుగు రకాల పణ్యారములను కూడా సమర్పిస్తారు. వీటిలో లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) ఉంటాయి. రెండో గంట అనంతరం స్వామివారికి మధ్యాహ్న నైవేద్యం లేదా రాజభోగం నిర్వహిస్తారు. ఈ సమయంలో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి ప్రసాదాలను సమర్పిస్తారు.

మూడో గంట అనంతరం రాత్రి నైవేద్యంగా శయనభోగం నిర్వహిస్తారు. మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం (దోశ), లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), శర్కరాన్నం తదితర ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు.సాయంకాల ఆరాధన సమయంలో గర్భాలయాన్ని మరోసారి శుభ్రపరిచి, శ్రీవారిని తాజా పుష్పాలతో అలంకరిస్తారు. అనంతరం నిర్వహించే శయనభోగంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో ‘తిరువీసం’ అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరువీసంలో తెల్ల అన్నంతో పాటు బెల్లంతో తయారు చేసిన తీపి రుచిగల గుడాన్నం ఉంటుంది.
రోజులో చివరిగా నిర్వహించే ఏకాంత సేవలో స్వామివారికి వెచ్చని పాలు, కాలానుగుణంగా లభించే ముక్కలుగా కోసిన పండ్లు, నెయ్యిలో వేయించిన ఎండు పండ్లను సమర్పిస్తారు. భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరించే పులిహోర, పొంగలి, వడ, అప్పం వంటి ప్రసాదాల వెనుక ప్రాచీన వైఖానస ఆగమ సంప్రదాయాలు దాగి ఉన్నాయి. ప్రతి నైవేద్యానికి ప్రత్యేకమైన పేరు, తయారీ విధానం, సమర్పించే సమయం ఉండటం తిరుమల ఆలయ వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతిరోజూ వివిధ సమయాల్లో నిర్వహించే ఈ నైవేద్య కైంకర్యాలు శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న ప్రాచీన వైదిక, ఆగమ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
[ 45 types of prasadam are offered daily to Lord Tirumala, TTD, Tirumala, Naivedhyam,
Chakra Pongali, CM Chandrababu, Naralokesh, BR Naidu ]


