TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆరు నెలల్లో 23 మరణశిక్షలు: ఫ్యామిలీ కోర్టుకు బదలీ.. యూపీలో సంచలనం.!

Published on: Mon Oct 26, 2026 3:31PM

ఉత్తర ప్రదేశ్ లో ఓ న్యాయమూర్తి కేవలం ఆరునెలల వ్యవధిలో 23 మరణ శిక్షలు విధించడం దేశ వ్యాప్తంగా న్యాయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా సేవలందిస్తున్న జస్టిస్ రవి కుమార్ దివాకర్ ఆరు నెలల వ్యవధిలో ఏకంగా 23 మరణశిక్షలు విధిస్తూ తీర్పులు వెలువరించారు. ఆయనను    ముఫఫర్‌నగర్‌లోని కుటుంబ కోర్టుకు  అదనపు ప్రిన్సిపల్ జడ్జిగా బదిలీ చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జస్టిస్ దివాకర్ పెద్ద సంఖ్యలో మరణశిక్షలు విధిస్తూ తీర్పులు ఇవ్వడం ఎంత సంచలనం సృష్టించిందో, ఆయన బదిలీ కూడా అంతే సంచలనం సృష్టించింది.  

జస్టిస్   రవి కుమార్ దివాకర్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కేసులను విచారించి మొత్తం 11 కేసుల్లో   23 మందికి మరణశిక్ష  ఖరారు చేస్తూ తీర్పులు వెలువరించారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని మరణశిక్షలు విధించడం దేశంలో ఇదే మొదటి సారి అని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు తన మునుపటి పోస్టింగ్‌లలో కూడా ఆయన కొన్ని మరణశిక్షలు విధించిన రికార్డులు ఉన్నాయి. ఆయన కఠినమైన తీర్పుల శైలి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అయితే..ఇప్పుడు ఆయన బదలీ కూడా అదే స్థాయిలో చర్చకు తావిచ్చింది. అయితే ఈ బదిలీ ఆయన విధించిన మరణశిక్షల సంఖ్య కారణంగా మాత్రమే కాదనీ,    తన కోర్టు నుంచి   97 కేసులను  పాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా ఇతర స్థానాలకు మార్చడాన్ని బాహాటంగా నిరసిస్తూ ప్రశ్నించడమే కారణమనీ అంటున్నారు. హత్యలు,    ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో, సరైన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ల ద్వారా కేసులను వెనక్కి తీసుకోవడంపైజస్టిస్ రవికుమార్ దివాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై ఒక  కేసుకు సంబంధించి ఇచ్చిన 35 పేజీల సుదీర్ఘ తీర్పులో జడ్జి దివాకర్ న్యాయ స్వాతంత్ర్యం, జిల్లా జడ్జిల పరిపాలనా అధికారాల పరిమితుల గురించి  ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ జరుగుతున్న కేసులను ఉన్నతాధికారులు కేవలం పరిపాలనాపరమైన ఉత్తర్వులతో మార్చవచ్చా అని ఆయన నిలదీశారు. ఈ నిలదీత  న్యాయ వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి తప్పించి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు.  


[23 Death Sentences Six Months, Justice Ravi Kumar Diwakar Transfer,  Allahabad High Court Order, Discussion,  Judicial Independence, Telugu One]