22-ఏ సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ: మంత్రి పొంగులేటి
Published on: Sat Oct 3, 2026 9:03PM

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ పట్టా భూములు నివాస వినియోగంలోకి మారినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు మార్గం సుగమం చేసింది. అర్హత ఉన్న భూములకు నాలా రుసుముతో పాటు నిబంధనల ప్రకారం ఇతర ప్రభుత్వ రుసుములు వసూలు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ మేరకు మెమో నంబర్ 48062/ULC/A1/2026 ద్వారా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
.webp)
నాలా ప్రక్రియ పూర్తికాకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే నమోదై ఉన్న, 22-ఎ జాబితాలో చేరిన నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి చెప్పారు. దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూ హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.అర్హులైన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలతో పాటు అమలు పురోగతిపై నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు.
.webp)
ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి తమ సొంత ప్లాట్లను విక్రయించుకోలేక, వాటిపై రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.22-ఎకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల కోణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అధికారులు బాధ్యతాయుతంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
గత నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగా 22-ఎకు సంబంధించిన సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు పొంగులేటి తెలిపారు. 22-ఎ సమస్యల పరిష్కారంపై సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అనంతరం జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ తాజాగా మెమో జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
.webp)
[ 22-A Lands, 22-A Land Issues, NALA Process, NALA Charges, Land Problems, Patta Lands, Land Registrations, Ponguleti Srinivas Reddy, Telangana Government, Revenue Department, District Collectors, Land Rights, Urban Land Ceiling, GO 118, GO 76, Memo 48062/ULC/A1/2026, Revanth Reddy, Fast-Track Resolution ]


