కల్తీ మద్యం కాటుకు 12 మంది బలి.. ఎక్కడంటే?
Published on: Sun Sep 6, 2026 12:42PM

కల్తీ మద్యం కాటుకు 12 మంది బలైపోయారు. మరో పది మంది చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సాగర్ జిల్లా బరాజ్, ఘుగ్రు, నౌరా తదితర గ్రామాల ప్రజలు శనివారం (సెప్టెంబర్ 5) రాత్రి సమయంలో మద్యం సేవించారు. అయితే మద్యం తాగిన కొద్దిసేపటికే తీవ్ర వారిలో కడుపునొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారందరినీ హుటాహుటిన సమీపంలోని వైద్యశాలలకు తరలించారు. అయితే, మార్గమధ్యలో కొందరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మరణించారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో వైద్య బృందాలను రంగంలోకి దంపి, ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. గడిచిన రెండు రోజుల్లో మద్యం సేవించిన వారు ఎవరైనా ఉంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్‌డా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలు వస్తేనే మరణాలకు గల అసలు కారణాలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. కల్తీ మద్యాన్ని ఎక్కడి నుంచి సరఫరా చేశారు? దీని వెనుక ఎవరున్నారన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.
కాగా కల్తీ మద్యం తాగి 12 మంది మరణించిన ఘటనపై ప్రజజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. అక్రమంగా నాటుసారా, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం వ్యాపారులపై కఠిన శిక్షా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
[12Dead After Drinking Spurious liquor, Madhya Pradesh, Sagar district tragedy, illicit liquor deaths, Telugu One]


