TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..!

Published on: Tue Aug 25, 2026 2:39PM

 

హైదరాబాద్ నగరంలో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో 11 మంది నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూనివర్సిటీల్లో వైద్య విద్య అభ్యసించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకున్న నిందితులు.. వాటి ఆధారంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా క్లినిక్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ యూనివర్సిటీల పేర్లను ఉపయోగిస్తూ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలను తయారు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 

ఆ సర్టిఫికెట్లను చూపిస్తూ తాము అర్హత కలిగిన వైద్యులమని నమ్మించి క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నకిలీ వైద్యుల్లో కొందరు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా క్లినిక్స్‌లో ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? ఎలాంటి మందులు రాస్తున్నారు? ఎంతకాలంగా వైద్య వృత్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్య విద్య, అర్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా వైద్యం చేయడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నిందితులను  అరెస్టు చేసి వారి వద్ద నుంచి లభించిన పత్రాలు, సర్టిఫికెట్లు, క్లినిక్‌కు సంబంధించిన రికార్డులు, మందులను పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 11 మందిని పోలీసులు విచారిస్తూ.. వారి విద్యార్హతలు, సర్టిఫికెట్ల చెల్లుబాటు, క్లినిక్స్ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, ఇప్పటివరకు ఎంతమంది రోగులకు వైద్యం అందించారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే నగరంలో నకిలీ వైద్యుల వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

11 fake doctors arrested in Hyderabad, Jubilee Hills, Secunderabad zones, Fake certificates, Telangana Health Department, CM Revanth reddy, Minister damodara