TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. ఒక్కటైన అంజలి, రఘురామ్.!

Published on: Thu Nov 26, 2026 2:40PM

షర్మిల కుమార్తె పెళ్లి వేడుక.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం ఘనంగా జరిగింది. డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి వివాహం బుధవారం కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. తొలుత క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు.

ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్నారు. వైఎస్సార్ దీవెనలు, అమ్మ ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల ఆనందోత్సాహాల మధ్య అంజలి, రఘురామ్‌ల వివాహ వేడుక కన్నులపండువగా జరిగిందని పేర్కొన్నారు. నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, నమ్మకం, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.

ఇరు కుటుంబాల సంప్రదాయాలను గౌరవిస్తూ గురువారం సాయంత్రం హిందూ పద్ధతిలో మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా నంది హిల్స్ సమీపంలోని 'ఓరా ఆకాశం' రిసార్ట్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, కుటుంబ శ్రేయోభిలాషులు హాజరుకానున్నారు.

వైఎస్ అంజలి రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మనవరాలు. వరుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి.. సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడు. తమ కుమార్తె వివాహం గురించి వైఎస్ షర్మిల సెప్టెంబర్‌లోనే అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడ చదవండి: KCR దీక్ష వెనుక అసలు కథేంటి.. నాట్ ఎ మహాత్మాలో ఏం ఉంది.!

వివాహ పనులు ప్రారంభించే ముందు ఇరు కుటుంబాల పెద్దలు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. వైఎస్సార్ సమాధి వద్ద తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లికి ముందు హల్దీ సహా పలు ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేశాయి.

కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ షర్మిల స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను కలిసి ఆహ్వానించారు. ప్రస్తుతం కర్ణాటకలో వివాహ వేడుకలను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకే పరిమితం చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల కోసం డిసెంబర్‌లో హైదరాబాద్‌లో మరో భారీ రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.


మీకు నచ్చవచ్చు: మనిషి 1400 ఏళ్లు బతకగలడా..వృద్ధాప్యానికి ఏఐ చెక్ పెట్టనుందా.!

మీకు నచ్చవచ్చు: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.!


[ YS Sharmila Daughter marriage, Anjali Reddy, Somala Raghuram Reddy, Anjali Wedding, YS Rajasekhara Reddy, Brother Anil Kumar, YSR Family, Bengaluru Wedding, Christian Wedding Ceremony, Hindu Wedding Ceremony ]