7 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై చైనా అధ్యక్షుడు.. సరిహద్దు వివాదాలపై క్లారిటీ రానుందా..?
Published on: Sat Sep 12, 2026 1:26PM
.webp)
BRICS Summit 2026.. మోదీ - జిన్‌పింగ్ కీలక భేటీ..!
ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 18వ బ్రిక్య్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 11:40 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో జరిగే రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగం కానున్నారు.
జిన్‌పింగ్ కాన్వాయ్‌లో సీపీసీ సెంట్రల్ కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ కై కీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వంటి అత్యంత కీలకమైన నేతలు కూడా ఉండటం గమనార్హం. 11 సభ్య దేశాలతో విస్తరించిన బ్రిక్య్స్ కూటమికి 2026 సంవత్సరంలో భారత్ అధ్యక్షత వహిస్తుండటం విశేషం. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో ఆర్థిక సహకారం, వాణిజ్యం-పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, ఇంధన మరియు ఆహార భద్రతతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

ఈ పర్యటనలో యావత్ ప్రపంచం దృష్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక భేటీపైనే నిలిచింది. గతంలో 2019లో చెన్నైలో జరిగిన అనధికారిక సదస్సు తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, అక్టోబర్ 2024లో సరిహద్దుల వద్ద దళాల ఉపసంహరణపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు క్రమంగా పుంజుకోవడం ప్రారంభించాయి.

సరిహద్దుల్లో కొన్ని సైనిక మోహరింపులు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాణిజ్య మరియు వ్యాపార సంబంధాలు క్రమంగా సర్దుమణుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న మోడీ-జిన్‌పింగ్ భేటీలో ఇరు దేశాల సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, మార్కెట్ యాక్సెస్, సరిహద్దు వివాదాల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు, అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వంటి సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
.webp)
ఒకవైపు గ్లోబల్ పవర్స్‌తో వ్యూహాత్మక బంధాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఈ సదస్సును చక్కటి వేదికగా మలుచుకుంటోంది. భేటీకి ముందే చైనా కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపడం, ఇరు దేశాలు తమ విభేదాలను సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ సహకారాన్ని పెంచుకోవాలని బీజింగ్ పిలుపునివ్వడం ఇరు దేశాల మధ్య మారుతున్న సానుకూల ధోరణికి అద్దం పడుతోంది.
[ Xi Jinping, Narendra Modi, BRICS Summit 2026, India China relations, Delhi news, India visit, Global South, Border Dispute Resolution, India China Relations, Telugu One, Telugu News ]


