TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిబంధనల మేరకు ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Published on: Tue Aug 25, 2026 9:09PM

 

నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు, రోజువారీ కూలీలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  సూచించారు. మంగళవారం బుచ్చిరెడ్డిపాళెంలో మీడియాతో మాట్లాడుతూ, ఇసుక సమస్యను భవన నిర్మాణ కార్మికులు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారు, రోజువారీ కూలీలు ఇప్పటికే తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. 

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  స్పందించి, నిబంధనలకు లోబడి ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం కల్పించారని చెప్పారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే ఇసుకను తరలించుకోవాలని, ఇందుకు ట్రాక్టర్లు, కూలీల సాయాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు. జేసీబీలు, టిప్పర్లు వినియోగించకూడదని, రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని స్పష్టం చేశారు.

నిబంధనలు పాటిస్తే అందరికీ ప్రయోజనం..!

కోవూరు నియోజకవర్గంలో ఉచిత ఇసుక విధానం సజావుగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే  కోరారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. అవసరమైతే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తారని చెప్పారు. ఉచిత ఇసుక విధానం వల్ల కార్మికులకు, నిర్మాణ రంగానికి మేలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

27 నుంచి బుచ్చిరెడ్డిపాళెంలో ‘వీపీఆర్‌ నేత్ర..!

పేదల కంటి చూపును రక్షించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి  వీపీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘వీపీఆర్‌ నేత్ర’ సేవలు ఈ నెల 27వ తేదీ నుంచి బుచ్చిరెడ్డిపాళెం శాంతినగర్‌లో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే  తెలిపారు. కోవూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటికే ‘వీపీఆర్‌ నేత్ర’ సేవలు పూర్తయ్యాయని, 27వ తేదీ నుంచి బుచ్చిరెడ్డిపాళెం మండలంలోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి అక్కడికక్కడే ‘వీపీఆర్‌ నేత్ర’ సిబ్బంది ఉచితంగా కళ్లజోళ్లు అందజేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో లక్షకు పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, 65 వేలకు పైగా కళ్లజోళ్లు అందజేశామని ప్రశాంతి రెడ్డి  వివరించారు. పేదల కంటి చూపును కాపాడే ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

VPR Netra, MLA Vemireddy Prashanthi Reddy, Vemireddy Prabhakar Reddy, VPR Foundation, CM Chandrababu