వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అరెస్ట్..!
Published on: Tue Sep 22, 2026 3:55PM

ఎంజీఎం ఆస్పత్రి వద్ద రణరంగం.. రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే..!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదకర సంఘటనలు, ముఖ్యంగా భవనాల పైకప్పు పెచ్చులూడిపడుతున్న దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
ఈ తోపులాటలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాలు, చేతికి బలమైన గాయాలై రక్తస్రావం జరిగినట్లు ఆయన వర్గీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాడే ఎంజీఎంలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు, వారి అటెండర్లు గాయపడిన ఘటన ఇంకా ముగియకముందే, మంగళవారం ఏకంగా ఆర్‌ఐసీయూ (RICU) వార్డులో మరోసారి పైకప్పు పెచ్చులు కుప్పకూలడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆస్పత్రిలో జరుగుతున్న ఈ వైఫల్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి, రోగుల భద్రతను సమీక్షించేందుకు వినయ్ భాస్కర్ హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు.
అయితే, ఆయనను ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. పోలీసుల చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసుల వలయాన్ని, ఆంక్షలను ధిక్కరించి, నిర్బంధాలను ఛేదించిన వినయ్ భాస్కర్ ఎలాగోలా ఆస్పత్రి ప్రాంగణంలోకి దూసుకెళ్లి క్షష్ట పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై గొంతు ఎత్తే వారిని, ప్రశ్నించే వారిని అణచివేయడమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలనగా మారిందని మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో పేద ప్రజలకు కనీస వైద్యం అందక పోవడానికి తోడు, సరైన బెడ్లు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తరచూ ఆస్పత్రి భవనాల పైకప్పులు కూలిపోవడం, అంబులెన్స్‌ల తీవ్ర కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సమస్యలను పరిశీలించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతను ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. ఆస్పత్రి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన యంత్రాంగం, నిలదీసే వారిని అణచివేయాలని చూస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
[ Vinay Bhaskar, MGM Hospital Warangal, BRS protest, Warangal news today, roof collapse hospital, Telangana political news, Congress party ]


