TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెజవాడలో పొలిటికల్ ట్విస్ట్: ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీతో రసవత్తరంగా రాజకీయం.!

Published on: Sun Oct 18, 2026 11:11AM

 కాంగ్రెస్, లెఫ్ట్ మద్దతుతో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న ఏబీవీ.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) మేయర్ పీఠం కోసం జరుగుతున్న పోరు అత్యంత రసవత్తరంగా మారింది. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న బెజవాడ రాజకీయం ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. 1989 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అనూహ్యంగా మేయర్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి రాజకీయ పార్టీ నేపథ్యం లేకుండా స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రధాన పార్టీలైన కూటమి తరఫున వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్‌సీపీ తరఫున రాయన భాగ్యలక్ష్మి బరిలో ఉన్నప్పటికీ, మాజీ ఐపీఎస్  ఏబీవీ అభ్యర్థిగా ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.  

 

ఈ ఎన్నికల్లో ఏబీ వెంకటేశ్వరరావుకు కేవలం వ్యక్తిగత హోదా మాత్రమే కాకుండా, బలమైన రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు లభిస్తుండటం విశేషం. రాష్ట్రంలో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా ఏబీవీకి మద్దతు తెలుపుతూ కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా వివిధ కార్మిక, ప్రజా సంఘాలు కూడా ఆయనకు వెన్నుదండగా నిలవడంతో ఈ పోరు త్రిముఖ పోటీగా లేదా అంతకంటే ఉత్కంఠభరితంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా రెండుసార్లు సేవలు అందించిన ఏబీవీకి, నగరంలోని అన్ని ప్రాంతాలపై, స్థానిక సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు ప్రాంతానికి చెందిన ఆయన, పదవీ విరమణ తర్వాత ప్రజా సమస్యలపై, ముఖ్యంగా 22ఏ భూముల వివాదాలు  ప్రభుత్వ నిర్ణయాలపై నిరంతరం గళం వినిపించారు.   


ప్రస్తుతం విజయవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఏబీ వెంకటేశ్వరరావు రంగప్రవేశం ఎవరి ఓట్లకు గండి కొడుతుందనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో మొదలైంది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న బెజవాడ నగరంలో, ఈ పరిణామం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అది కూడా ఇండియా కూటమి  లెఫ్ట్ పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ బరిలో నిలవడం ఏపీ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన పరిణామంగా నిలుస్తోంది. ఈ ఎన్నికల పోరు ముగిసేసరికి బెజవాడ రాజకీయం ఏయే కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.   

 

 

 

[ Vijayawada Mayor Elections, AB Venkateswara Rao, Vijayawada Municipal Corporation, Ex IPS ABV, Bezawada Politics, Congress Left Support Vijayawada, Retired IPS Officer ABV, Vangaveeti Radhakrishna, YS Sharmila Congress, Vijayawada Municipal Corporation]