విజయ్–రష్మికపై ట్రోలింగ్.. పోలీసులను ఆశ్రయించిన టీమ్.!
Published on: Mon Oct 26, 2026 9:29PM

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కొద్ది రోజులుగా నెట్టింట తీవ్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకత, మార్ఫింగ్ చేసిన స్క్రీన్‌షాట్లు మరియు దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకున్న వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రముఖ టెలివిజన్ టాక్ షోలో ఈ జోడి పాల్గొన్న తర్వాత సోషల్ మీడియా వేదికగా వీరిపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఈ విమర్శలు కేవలం అభిప్రాయాల వ్యక్తీకరణ హద్దులు దాటి, పూర్తిగా కల్పిత కంటెంట్ వ్యక్తిగత దూషణల స్థాయికి చేరాయని విజయ్, రష్మికల సన్నిహిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
తమపై కావాలనే కొందరు వ్యక్తులు వ్యవస్థీకృత నెగెటివ్ క్యాంపెయిన్‌ను నడుపుతున్నారని ఆరోపిస్తూ బాధితుల తరపు బృందం సైబర్ పోలీసులకు తగిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను సృష్టిస్తూ, తమ గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో స్పష్టంగా కోరారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు సమాచారం. కేవలం ఫ్యాన్ వార్స్ లేదా అభిప్రాయాల పేరుతో కొందరు క్షద్ర రాజకీయాలకు పాల్పడుతూ సమాజంలో తప్పుడు సంప్రదాయానికి తెరలేపుతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు మరియు ఫేక్ పోస్టులను వైరల్ చేయడం పెరిగిపోయిందని, దీనివల్ల నటీనటుల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్-రష్మిక టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాను ఆయుధంగా మలచుకుని సెలబ్రిటీలపై ఇష్టానుసారం విరుచుకుపడే ట్రోలర్స్‌కు ఈ ఫిర్యాదు ఒక గట్టి హెచ్చరికలా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సైబర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు త్వరలోనే తప్పుదోవ పట్టించే పోస్టులు చేసిన అకౌంట్లపై విచారణ వేగవంతం చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
[ Vijay Deverakonda, Rashmika Mandanna, Cyber Crime Police Hyderabad, Virosh online harassment, Telugu film news, Cyber Crime Complaint, Hyderabad Police, Social Media Trolling, ViRash ]


