TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రపంచ డీజిల్ సంక్షోభం వెనుక అసలు కారణం ఏంటి..? జెలెన్స్కీకి ట్రంప్ హెచ్చరిక అందుకేనా?

Published on: Tue Sep 15, 2026 6:56AM

అమెరికాలో తలెత్తిన తీవ్రమైన ఇంధన కొరత,  ధరల పెరుగుదల నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీకి స్పష్టమైన హెచ్చరిక చేశారు. రష్యాలోని డీజిల్, ఇంధన సౌకర్యాలపై ఉక్రెయిన్ సైన్యం చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలన్నదే ఆ హెచ్చరిక. రష్యాలోని డీజిల్, ఇంధన సౌకర్యాల దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా వ్యవస్థ దెబ్బతిని, ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా  ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో డీజిల్ ధరలు చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యలో ట్రంప్ చేసిన హెచ్చరిక  ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ దాడుల పరంపర 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచే ప్రారంభమైంది. రెండు దేశాలు కూడా పరస్పరం   కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా ఎంచుకుంటూ దాడులకు తెగబడుతున్నాయి.   తొలినాళ్లలో రష్యా ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్లు, పవర్ ప్లాంట్లపై విరుచుకుపడగా, ఉక్రెయిన్ సైన్యం రవాణా మార్గాలు, పంపింగ్ స్టేషన్లు, స్టోరేజ్ ట్యాంకులను టార్గెట్ చేసింది. 

అయితే 2024 నుంచి ఈ దాడుల స్వభావం పూర్తిగా మారిపోయింది. ప్రత్యక్షంగా చమురు రిఫైనరీలపై డ్రోన్లు,  క్షిపణులతో దాడులు చేయడం పెరిగింది. ముఖ్యంగా 2025 చివరి నాటికి, అలాగే 2026 మధ్య కాలంలో దూరప్రాంతాలను తాకే డ్రోన్ల ద్వారా వందలాది దాడులు జరిగినట్లు నివేదికలుచెబుతున్నాయి. ఉక్రెయిన్ వాదన ప్రకారం రష్యా యుద్ధ యంత్రానికి నిరంతరం ఇంధనం అందిస్తున్న రిఫైనరీలు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలే. మరోవైపు ఈ దాడుల కారణంగా రష్యా దేశీయంగా   గ్యాసోలిన్, డీజిల్ కొరతను చవిచూడాల్సి వచ్చింది.  ఈ ఉద్రిక్తతల ఫలితంగా అమెరికాలో జాతీయ డీజిల్ సగటు ధర గాలన్‌కు ఆరు డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ కొన్ని ఇంధనం నింపే కేంద్రాల్లో డీజిల్ ధర గాలన్‌కు 9.999 డాలర్లుగా డిస్‌ప్లే కావడంతో పంపుల గరిష్ట పరిమితిని తాకినట్లయింది. 

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇరాన్ యుద్ధ వాతావరణం, హార్మజ్ జలసంధి ప్రాంతంలో సముద్ర రవాణా ఉద్రిక్తతలు కూడా తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా డీజిల్ సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమైంది. రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ నిరంతరం జరుపుతున్న దాడుల వల్ల ప్రపంచ మార్కెట్లకు అందాల్సిన ఇంధన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం ఈ దాడుల చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైనిక చర్యకు ప్రత్యక్షంగా సహకరించి, శత్రువుకు బలాన్ని చేకూర్చే ఏ వస్తువైనా సైనిక లక్ష్యమే అవుతుందని ఉక్రెయిన్ వాదిస్తోంది. అయితే ప్రత్యర్థుల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఉద్దేశంతో సామాజిక మౌలిక వసతులు,  ఇంధన కేంద్రాలను ధ్వంసం చేయడం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అవుతుందని రష్యా వాదిస్తూ వస్తోంది. 

ఉక్రెయిన్ పౌర విద్యుత్ వ్యవస్థలపై రష్యా గతంలో జరిపిన దాడులను అనేక మంది న్యాయ నిపుణులు యుద్ధ నేరాలుగా అభివర్ణించగా, ఉక్రెయిన్ మాత్రం వ్యూహాత్మక లక్ష్యాల మీదే దాడులు పరిమితం చేస్తున్నామని చెబుతోంది.  ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ ఇంధన మార్కెట్లను నిలబెట్టడంలో భారత్ పాత్ర అత్యంత కీలకమైనదిగా నిరూపితమైంది. భారతదేశం తన  రిఫైనింగ్ సామర్థ్యంతో ప్రపంచ దేశాలకు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను భారీ ఎత్తున ఎగుమతి చేస్తోంది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటూనే, మరోవైపు యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాలకు రిఫైన్డ్ ఇంధనాన్ని సక్రమంగా అందిస్తూ గ్లోబల్ సప్లై చెయిన్‌కు వెన్నెముకగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి భౌగోళిక రాజకీయ ఘర్షణలు కొనసాగితే, ఇంధన భద్రతను కాపాడుకోవడానికి బహుళ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రపంచ దేశాలకు అనివార్యంగా మారనుంది.

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    

 [Ukraines attacks, Russian refineries, Global diesel crisis, Donald Trump warning,India  petroleum exports]