TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు: ఏ రోజు ఏ సేవంటే?

Published on: Sun Sep 27, 2026 5:55PM

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో మరో ఆధ్యాత్మిక పర్వదినానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 12 నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చాంద్రమాన పంచాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధికమాసం కారణంగా, ఈ ఏడాది తిరుమలలో రెండోసారి బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. ఇప్పటికే కన్యామాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగియగా, ఇప్పుడు దసరా నవరాత్రుల వేళ ఆశ్వయుజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ పవిత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టీటీడీ అధికారికంగా విడుదల చేసింది. అయితే, సాధారణ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భిన్నంగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలలో తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద రథం లాంటి విశేషాలు ఉండవని, అలాగే ముగింపు రోజు ధ్వజావరోహణం కూడా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఉత్సవాల సమయంలో శ్రీమలయప్ప స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు. అక్టోబర్ 11న రాత్రి అంకురార్పణతో ఈ వేడుకలు లాంఛనంగా ప్రారంభమై, అక్టోబర్ 20న జరిగే చక్రస్నానంతో పరిసమాప్తం కానున్నాయి.

భక్తుల అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే మహా ఘట్టమైన గరుడ వాహన సేవ అక్టోబర్ 16న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు కన్నుల పండువగా నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 19న స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా సాగనుంది.సాధారణంగా ఉదయం వాహన సర్వీసులు 8 నుండి 10 గంటల వరకు, రాత్రి పూట 7 నుండి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ప్రత్యేక ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతోంది.శ్రీవారి సేవలో తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో, రద్దీ నియంత్రణ, వసతి, ప్రసాదాల పంపిణీపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. దసరా సెలవులను పురస్కరించుకుని భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.

 

 

[ Tirumala Navaratri Brahmotsavams, Srivari Brahmotsavam Schedule, Garuda Vahana Seva Tirumala, TTD Updates, Lord Venkateswara Swamy Festivals, TTD, TTD Chairman B.R. Naidu, CM Chandrababu, Naralokesh ]