తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గ్రీన్ సిగ్నల్.!
Published on: Mon Oct 26, 2026 2:27PM

సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కీలక ముందడుగు పడింది. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అయితే, మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి, తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు.
152 మీటర్ల ఎత్తు ఎందుకు అవసరం..?
సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు సాగు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక అవకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మహారాష్ట్ర నాయకత్వం మధ్య కుదిరిన ఒప్పందం నుంచి వివిధ దశల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఐదు దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయామని వివరించారు.2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని మంత్రి తెలిపారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మాణం చేపడితే తెలంగాణ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడం కష్టమవుతుందని వివరించారు.

ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇందుకోసం బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు.మహారాష్ట్రలో బ్యారేజీ కారణంగా ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఆదివాసీల సాగు, తాగునీటి ఆకాంక్షలు నెరవేరాలి.!
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావించారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంతో సరిహద్దు ప్రాంతాలకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా అటవీ ప్రాంతమని, అక్కడి గిరిజనులు, ఆదివాసీలు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నారని తెలిపారు.
కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి విమానాశ్రయం.!
ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం ప్రాధాన్యాన్ని కూడా సీఎం వివరించారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికీ ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టు అని వివరించారు.
ఫడ్నవీస్ సానుకూల స్పందన.!
తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడేవారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న ప్రతిపాదనను పునఃపరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫడ్నవీస్ తెలిపారు. అయితే, మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు.

సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు అభ్యంతరం లేదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర చర్చల ద్వారా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతోనూ చర్చలు, పరస్పర సహకారం ద్వారా అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించిన అనుభవం మహారాష్ట్రకు ఉందని గుర్తుచేశారు.
అధికారుల కమిటీ ఏర్పాటు.!
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు.ఈ కమిటీ బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, ప్రభావిత ప్రాంతాలు, పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించనుంది. రెండు రాష్ట్రాల అంచనాలను సమీక్షించి, అవసరమైతే ప్రత్యామ్నాయాలపైనా అధ్యయనం చేయాలని సూచించారు.
కేంద్ర జల సంఘం (CWC) తన పరిధిలో అవసరమైన సాంకేతిక అధ్యయనాలను చేపడుతుందని తెలిపారు. అధికారుల కమిటీ నివేదిక, సాంకేతిక పరిశీలనల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనులు, ఆదివాసీల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. తాజా సమావేశంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు ప్రతిపాదనపై తదుపరి చర్చలకు మార్గం సుగమమైంది.
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఫడ్నవీస్‌కు ఆహ్వానం.!
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
[ Thummidihatti Barrage, Revanth Reddy, Devendra Fadnavis, Uttam Kumar Reddy, Telangana Maharashtra Talks, Pranhita River, Irrigation Project, Adilabad Development, Barrage Height 152 Meters, Central Water Commission, Telangana Irrigation, Inter State Water Dispute ]


