TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొన్నం.!

Published on: Tue Oct 27, 2026 9:40PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉండగా గాయపడిన ప్రవళిక ప్రస్తుతం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రవళికను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కండక్టర్‌కు అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి, భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఖమ్మం రీజియన్‌లో జరిగిన ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సిబ్బంది ప్రవర్తనపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆర్టీసీ అధికారులకు తెలియజేయాలని, అంతేకానీ ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించకూడదని హెచ్చరించారు.

ఉద్యోగుల భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత అయినప్పటికీ, వారి ప్రాణ రక్షణ, భద్రత కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, సంస్థను పరిరక్షించడం లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఇటువంటి దురదృష్టకర ఘటనలు మరోసారి జరగకుండా ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సహకరించాలని కోరారు.

 

 

 

[ TGSRTC Conductor Pravalika, Ponnam Prabhakar, Telangana RTC, Telangana Government, Revanth Reddy Government, RTC Employee Safety, RTC Conductor Attack, Ashwapuram Incident, Bhadradri Kothagudem, Khammam Region, Manuguru Depot, Sai Sanjeevani Hospital ]