బ్యారేజీల పునరుద్ధరణకు రేవంత్ సర్కార్ శ్రీకారం.. డిసెంబర్లో పనులు ప్రారంభం.!
Published on: Thu Nov 5, 2026 8:21PM
.webp)
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది డిసెంబర్లోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బ్యారేజీలను సురక్షితంగా పునరుద్ధరించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని లిఫ్ట్ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నీటిని సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, నిర్మాణ లోపాలున్న ఈ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
దిగువ గోదావరి జలాల సద్వినియోగం.!
దిగువ గోదావరిలో లభించే నీటిని వృథా కాకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా సమర్థంగా వినియోగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకాల ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించినట్లు వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయగా, ఈ మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని వినియోగించినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఇది 89 శాతం అధికమని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 8.10 టీఎంసీలు.. మొత్తంగా 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు.
రూ.4,193 కోట్లతో పునరుద్ధరణ ప్రణాళిక.!
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మేడిగడ్డ కుంగుబాటుకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ లోపాలే కారణమని సీఎం పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ నీటి ఇబ్బందులు తలెత్తేవి కాదని అభిప్రాయపడ్డారు.
ప్రాణహిత జలాలను తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉండేదని చెప్పారు.మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత మూడు బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు వివరించారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
.webp)
మూడు బ్యారేజీల పునరుద్ధరణ కోసం సుమారు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాల కారణంగా చేపట్టాల్సిన మరమ్మతుల వ్యయాన్ని సంబంధిత నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు.
డిసెంబర్లో పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం.!
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరులోగా తుది అనుమతులు పొందేందుకు ప్రయత్నించాలని, డిసెంబర్లో పనులు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులు, రక్షణ చర్యలను రెండు దశలుగా విభజించి చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ప్రమాదమే..!
[ Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation ]


