TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంద్రాగస్టు ముందు షహజాద్ భట్టి నెట్వర్క్ పై దాడులు.. భద్రతా విజయమేనా?

Published on: Sat Aug 22, 2026 4:43PM

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన కోఆర్డినేటెడ్  ఉగ్రవాద నిరోధక చర్యలో 253 మందిని అదుపులోకి తీసుకుని, 200 మందికిపైగా అరెస్టు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం చాలా సీరియస్ అంశం. ప్రభుత్వ వాదన ప్రకారం  పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న, ఐఎస్ఐ మద్దతున్నట్లు ఆరోపణలున్న షహజాద్ భట్టి నెట్వర్క్ పై సాధించిన విజయం.   ఆగస్టు 15ను లక్ష్యంగా చేసుకున్న విధ్వంసక ప్రణాళికలను సక్సెస్ ఫుల్ గా  భగ్నం చేశామని కేంద్రం చెబుతోంది. 

కానీ  ఇక్కడ ఒక స్పష్టమైన గీతను గీయాలి.. ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం, ఎఫ్ఐఆర్లు, అరెస్టులు అభినందించాల్సిన విషయాలే అయినా..  ఆరోపిత నెట్వర్క్ ను నిర్మూలించాం  అనే రాజకీయ ప్రకటన  తుది న్యాయ నిర్ధారణకు సమానం కాదు. పోలీసు కేసు దర్యాప్తు, అభియోగపత్రం, సాక్ష్యాల పరీక్ష, విచారణ, న్యాయస్థాన తీర్పు అనే క్రమం పూర్తయ్యే వరకు అరెస్టయిన ప్రతి వ్యక్తి నిందితుడే తప్ప దోషి కాదు. ఉగ్రవాదంపై రాజీ ఉండకూడదు. నిజమే.. అయితే.. అదే సమయంలో..  ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో అరెస్టునే తీర్పుగా మార్చడం కూడా చట్ట  విరుద్ధమే.

కేంద్ర హోంశాఖ సమాచారం ప్రకారం, ఆగస్టు 12న కేంద్ర నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీసు బలగాల మధ్య   సమాచార మార్పిడి వ్యవస్థను ఉపయోగించి భారీ ఆపరేషన్ నిర్వహించారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ నెట్వర్క్ కు సంబంధించిన కేసుల్లో 200 మందికిపైగా అరెస్టయినట్లు, 80కుపైగా ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ప్రభుత్వం పేర్కొన్న రాష్ట్రాల వారీ అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య ప్రకారం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 62 మంది, హర్యానాలో 52 మంది,  ఢిల్లీలో 51 మంది, పంజాబ్లో 44 మంది ఉన్నారు. రాజస్థాన్లో 15 మంది; మహారాష్ట్రలో ఎనిమిది మంది,  ఉత్తరాఖండ్లో ఐదుగురు; కర్ణాటక, గుజరాత్, బిహార్లలో తలా ముగ్గురు,  తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, కేరళలో తలా ఇద్దరు ఉన్నారని నివేదికలు పేర్కొన్నాయి.  ప్రభుత్వం చెప్పిన స్వాధీనాల్లో ఐఈడీలు, పిస్టళ్లు, లైవ్ బుల్లెట్లు,  పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముద్రలున్నట్లు పేర్కొన్న గ్రెనేడ్లు, నిఘా,  రికానెసెన్స్ కు వినియోగించినట్లు ఆరోపిస్తున్న సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఈ స్వాధీనాల ఫోరెన్సిక్ నిర్ధారణ, స్వాధీనం గొలుసు (చెయిన్ ఆఫ్ కస్టడీ), డిజిటల్ పరికరాల శాస్త్రీయ పరీక్ష, ఆయుధాల మూల నిర్ధారణ వంటి అంశాలే కేసుల న్యాయబలాన్ని నిర్ణయిస్తాయి. 

హోంమంత్రి అమిత్ షా ప్రకారం, షహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్నది.  పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మద్దతుతో పనిచేస్తున్నది. ఈ నెట్వర్క్ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విధ్వంసానికి ప్రణాళికలు రచించింది. కో ఆర్డినేటెడ్ దాడులతో ఆ కుట్రను అడ్డుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.  నెట్వర్క్ పై  దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణల జాబితా విస్తృతంగా ఉంది. రక్షణ, పోలీసు, మతపరమైన కీలక స్థావరాలపై నిఘా,  పేలుడు పదార్థాలు లేదా గ్రెనేడ్ దాడులు,  పెట్రోల్ బాంబు  దాడులు,  లక్ష్యిత హత్యలు; స్థానిక వ్యక్తులను సమీకరించి సమాచార సేకరణ  ఆ ఆరోపణల్లో ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు నిరూపితమైతే అవి సాధారణ నేరాలు కావు. దేశ భద్రత, సామాజిక సామరస్యం, రాజ్యాంగబద్ధ శాంతిభద్రతలపై ప్రత్యక్ష దాడులుగా పరిగణించాల్సిందే.  అయితే పాకిస్థాన్, ఐఎస్ఐతో నెట్వర్క్ తో  సంబంధం ఉందన్న  వ్యాఖ్యలను తిరస్కరించింది. దౌత్యపరమైన ఖండన ఒక దర్యాప్తు ఆధారాన్ని స్వయంగా కొట్టివేయదు.  అలాగే ప్రభుత్వ ఆరోపణను స్వయంగా న్యాయ సత్యంగా కూడా మార్చదు. ఈ దశలో బహిరంగంగా పరీక్షించదగిన సాక్ష్యాలు, ఎఫ్ఐఆర్ ల వివరాలు, న్యాయస్థాన పత్రాలు వెలుగులోకి రావడం అత్యవసరం.

షహజాద్ భట్టి ఎవరు?

షహజాద్ భట్టి పాకిస్థాన్ కు చెందిన గ్యాంగ్ స్టర్ గా , సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తిగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నెట్వర్క్ స్థానిక కార్యకర్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎంపిక చేసుకుని, వారిని ఉపయోగించుకున్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. 
ఇది ఆధునిక ఉగ్రవాద నిర్మాణంలో కీలక మార్పును సూచిస్తుంది. పాత తరహా సరిహద్దు చొరబాట్లు, శిక్షణ శిబిరాలే ప్రధాన ప్రమాదం కాదు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం, గుప్త సందేశ వేదికల ద్వారా నియామకం, చిన్న మొత్తాల డిజిటల్ ఆర్థిక సహకారం, స్థానిక నేరగాళ్ల వినియోగం.  “ఒంటరి కార్యాచరణకర్తల తరహా దాడుల ముప్పు నేటి సంక్లిష్ట సవాలు.  తుపాకీ పట్టిన వ్యక్తిని పట్టుకోవడం కన్నా, తుపాకీ చేతికి చేరకముందే నియామకం, డబ్బు, నిఘా, ఆయుధ సరఫరా గొలుసును ఛేదించడమే నిజమైన ఉగ్రవాద నిరోధక విజయం.

ఈ వ్యవహారంలో ఆగస్టు 12 నిర్ణాయక తేదీగా కనిపిస్తోంది. అదే రోజు కేంద్ర సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా అనేక రాష్ట్రాల్లో దాడులు ప్రారంభించినట్లు హోంశాఖ  చెబుతోంది. స్వాతంత్ర్య దినోత్సవానికి కేవలం మూడు రోజులు ముందు జరిగిన ఈ చర్య, ఆగస్టు 15 సందర్భంగా సాధారణంగా పెంచే భద్రతా అప్రమత్తత నేపథ్యంలో జరిగిందని స్పష్టమవుతోంది. దాడుల అనంతరం అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ, కర్ణాటకల్లో కొత్త ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆపై కేంద్ర హోంమంత్రి, 200 మందికిపైగా అరెస్టులతో నెట్వర్క్ ను  ధ్వంసం చేశామని బహిరంగంగా ప్రకటించారు. 
కానీ కాలక్రమంలో తదుపరి కీలక దశ ఇంకా మిగిలే ఉంది.  స్థానిక పోలీసు కేసుల సమన్వయం, డిజిటల్ మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాల విశ్లేషణ, ఆర్థిక లావాదేవీల అన్వేషణ, అంతర్రాష్ట్ర లింకుల నిర్ధారణ.  అవసరమైతే జాతీయ దర్యాప్తు సంస్థ జోక్యం, చివరికి అభియోగపత్రాలు,  విచారణ. వార్తా ప్రకటనతో ఆపరేషన్ ముగియవచ్చు.  కానీ న్యాయపరమైన కేసు అక్కడి నుంచే మొదలవుతుంది.

2014 ముందు–తరువాత

2014కు ముందు ఉగ్రదాడులు జరిగాయి.. 2014 తర్వాత ఉగ్రవాదం అంతమైంది  అనే రాజకీయ నినాదం వాస్తవానికి సరిపోదు. 2004-14 మధ్య భారతదేశం అనేక   ఉగ్రదాడులు, సరిహద్దు ఉగ్రవాదం, కశ్మీర్ హింస, ఈశాన్య తిరుగుబాట్లు, వామపక్ష తీవ్రవాద హింసను ఎదుర్కొంది. ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ వచ్చిన ఒక అధికారిక ప్రచురణ ప్రకారం 2004-14 మధ్య 7,217 ఉగ్రవాద ఘటనలు నమోదయ్యాయి.  అదే సమయంలో 2014 తర్వాత దేశంలో తీవ్ర భద్రతా ఘటనలు లేవని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధం. ప్రభుత్వ రికార్డులలోనే 2015, 2016లో  హింటర్ల్యాండ్లో ప్రధాన ఉగ్రదాడులు ప్రస్తావన ఉందని బీబీసీ విశ్లేషణ గుర్తుచేసింది. పుల్వామా వంటి ప్రాణనష్టం కలిగించిన దాడి కూడా 2019లో జరిగింది. కాబట్టి ఒక ప్రభుత్వాన్ని ప్రశంసించాలంటే నిరోధక నిఘా, సంస్థల సమన్వయం, సాంకేతిక సామర్థ్యం, దాడుల పరిమాణం మరియు విజయవంతమైన అభియోగాల వంటి కొలమానాలపై ఆధారపడాలి. చరిత్రను రెండు ముక్కలుగా చీల్చి ప్రచారంగా మార్చకూడదు. 

ఇప్పటి ఆపరేషన్లో ఉన్న సానుకూలాంశం ఏమిటంటే, దాడి జరిగిన తర్వాత ప్రతిస్పందించడం కంటే దాడి జరగకముందే అనుమానిత నెట్వర్క్ లను గుర్తించి అడ్డుకునే ప్రయత్నం. 14 ప్రాంతాల మధ్య తక్షణ నిఘా సమాచార సమన్వయం జరిగింది అన్నది నిజమైతే.. అది భద్రతా వ్యవస్థలో ఒక ప్రధాన కార్యాచరణ సామర్థ్యంగా పరిగణించాలి. అయినా ఆ సామర్థ్యానికి అసలు ప్రమాణం అరెస్టుల సంఖ్య కాదు..  నేరంలో ఎవరు నిజంగా భాగస్వాములయ్యారో నిరూపించి, కోర్టులో నిలిచే అభియోగాలు సాధించడమే. 

న్యాయపరమైన అంశం

ఈ కేసుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, భారత న్యాయ సంహిత, ఆయుధాల చట్టం, మాదకద్రవ్యాలు, మనోప్రభావ పదార్థాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు నమోదయ్యాయని హోంశాఖ తెలిపింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిషేధిత మాదకద్రవ్యాలు, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల ఆరోపణలకు ఒక్కో చట్టం వేర్వేరు నేర ప్రమాణాలు, శిక్షలు, సాక్ష్య నియమాలను కలిగి ఉంటుంది. ఉపా ప్రత్యేకంగా కఠినమైన చట్టం. ఉగ్రవాద ఆరోపణలున్న కేసుల్లో అభియోగపత్రం దాఖలుకు సాధారణ కాలపరిమితికంటే ఎక్కువ సమయం పొందే వీలుంటుంది. బెయిల్ ప్రమాణాలు కూడా సాధారణ క్రిమినల్ కేసుల కంటే కఠినంగా ఉంటాయి. అందుకే ఈ చట్టాన్ని నిజమైన ఉగ్రవాద కుట్రలపై సమర్థంగా ఉపయోగించడం ఎంత అవసరమో, దాని వినియోగంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సాక్ష్య ప్రమాణాలు, న్యాయపరమైన సమీక్షను కచ్చితంగా కాపాడటం కూడా అంతే అవసరం.

ఉపా బెయిల్ వ్యవహారాల్లో ప్రాసిక్యూషన్ సాక్ష్యానికి కనీస ప్రాథమిక విశ్వసనీయత ఉండాలని స్పష్టం చేశాయి. వెర్నన్ గోన్సాల్వెస్ కేసులో సాక్ష్యం నాణ్యత, నిరూపణాత్మక విలువపై ఉపరితల స్థాయి పరిశీలన అవసరమని కోర్టు పేర్కొంది. ఈ సూత్రం ఉగ్రవాద నిరోధక చర్యలను బలహీనపరచదు.  నిర్దోషులపై దీర్ఘకాలిక నిర్బంధం జరగకుండా చేసి, నిజమైన కేసులను కోర్టులో మరింత పటిష్ఠంగా నిలబెడుతుంది. 

రాజకీయ కోణం

కేంద్రం ఈ చర్యను  ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానానికి ఉదాహరణగా చెప్పడం రాజకీయంగా అర్థమయ్యే విషయం. కానీ ఈ మాటకు విలువ రావాలంటే అది సమాన ప్రమాణంతో అమలు కావాలి. ఉగ్రవాదం ఏ మతం, కులం, ప్రాంతం, పార్టీ లేదా సిద్ధాంతం ముసుగులో వచ్చినా దానిపై ఒకే రకమైన కఠిన చర్య ఉండాలి. ఎన్నికల లాభం కోసం ఉగ్రవాద నిరోధక చర్యలను ప్రచార దృశ్యాలుగా మార్చడం భద్రతా ప్రయోజనానికే నష్టం. మరోవైపు..  ప్రతీ భద్రతా చర్యను కేవలం రాజకీయ నాటకమని కొట్టిపారేయడం కూడా ప్రమాదకరం. పాకిస్థాన్ ఆధారిత సరిహద్దు ఉగ్రవాదం భారతదేశం ఎదుర్కొంటున్న వాస్తవ ముప్పు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిఘా లక్ష్యాల వంటి ఆరోపణలు నిరూపితమైతే, అవి రాజ్యాంగబద్ధ భారతదేశంపై దాడి చేయాలనే ప్రయత్నమే. ఆ వాస్తవాన్ని గుర్తించడం ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం కాదు.  దేశ భద్రతను వాస్తవికంగా చూడడం.

సామాజిక ప్రభావం

ఇలాంటి కేసులలో మతం, ప్రాంతం, సామాజిక గుర్తింపుల ఆధారంగా సమూహాలపై అనుమానం పెంచే రాజకీయ, మీడియా పద్ధతులు సమాజానికి విషం. ఒక నేర నెట్వర్క్ లో  ఉన్నట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల చర్యలకు మొత్తం సమాజాన్ని బాధ్యులను చేయడం న్యాయవిరుద్ధం మాత్రమే కాదు, అది ఉగ్రవాద సంస్థల లక్ష్యమైన సామాజిక విభజనకే తోడ్పడుతుంది.

నిఘా వ్యవస్థలు సామాజిక మాధ్యమాల నియామక వలలను పర్యవేక్షించాలి. పాఠశాలలు, కుటుంబాలు, స్థానిక సమాజ సంస్థలు యువతలో ఆన్లైన్ మోసపూరిత ప్రచారం, హింసాత్మక తీవ్రవాద సిద్ధాంతాల ప్రమాదాలపై అవగాహన పెంచాలి. కానీ దీనికి సమాంతరంగా డిజిటల్ నిఘా చట్టబద్ధత, గోప్యత, పర్యవేక్షణ వ్యవస్థలపై ప్రజాస్వామ్య నియంత్రణ ఉండాలి. భద్రత పేరుతో అన్ని పౌరులనూ ఎప్పటికీ అనుమానితులుగా చూడలేం. ప్రజాస్వామ్యానికి భద్రత అవసరం. కానీ భద్రతకు ప్రజాస్వామ్య న్యాయపద్ధతులే దీర్ఘకాలిక బలం. విచక్షణలేని నిర్బంధం కాదు.

 253 మంది, “200 అరెస్టులు,  80 ఎఫ్ఐఆర్లు  అన్న సంఖ్యలు శీర్షికలకు బలం ఇస్తాయి. కానీ ఆ సంఖ్యల మధ్య తేడాను మీడియా స్పష్టంగా చెప్పాలి. అదుపులోకి తీసుకోవడం అంటే దర్యాప్తు కోసం ప్రశ్నించడం కావచ్చు. అరెస్టు అంటే అధికారికంగా నేర ఆరోపణ కింద కస్టడీలోకి తీసుకోవడం.  ఎఫ్ఐఆర్ అంటే దర్యాప్తు ప్రారంభ పత్రం. అభియోగపత్రం లేదా దోష నిర్ధారణ కాదు. 

స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న గ్రెనేడ్లపై పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్నాయన్న వాదనకు ఫోరెన్సిక్ నిర్ధారణ ఎలా ఉంది? ఏ ఆయుధం ఎక్కడి నుంచి, ఎవరి వద్ద నుంచి స్వాధీనం అయింది? డిజిటల్ నిఘా పరికరాల్లో ఉన్న డేటా ఏమిటి? ఆర్థిక సహాయం విదేశీ మూలాల నుంచి వచ్చిందా? ఇలాంటి ప్రశ్నలకు కోర్టు పత్రాలు, దర్యాప్తు నివేదికలు, ఫోరెన్సిక్ ఫలితాలతో సమాధానం రావాలి. మీడియా ప్రకటనలను వార్తగా ఇవ్వొచ్చు..  కానీ వాటిని తీర్పుగా రాయడం కరెక్ట్ కాదు.  ఈ ఆపరేషన్ నిజంగా దేశ భద్రతకు ఒక ముఖ్య విజయం కావచ్చు. 14 ప్రాంతాల్లో సమన్విత చర్య, సంభావ్య హింసాత్మక ప్రణాళికలను ముందుగానే అడ్డుకోవడం, ఆయుధ సరఫరా మరియు స్థానిక మద్దతు వలయాన్ని ఛేదించడం.. ఇవి నిరూపితమైతే భద్రతా సంస్థలకు తగిన గుర్తింపు ఇవ్వాలి.  అయితే దేశానికి అవసరమైనది అరెస్టుల సంఖ్యతో కొలిచే భద్రత కాదు.. న్యాయస్థానంలో నిలబడే దర్యాప్తు, నిజమైన కుట్రదారులకు శిక్ష, నిర్దోషులకు రక్షణ, అంతర్రాష్ట్ర సమాచార వ్యవస్థల బలోపేతం, సామాజిక విభజనను అడ్డుకునే ప్రజాస్వామ్య పరిపక్వత. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటే ఇదే.  అసలు నేరస్తుడిపై ఎటువంటి మినహాయింపూ లేకపోవడం, అలాగే సాక్ష్యం లేనివారిపై చట్టవిరుద్ధ కఠినతకు కూడా మినహాయింపు లేకపోవడం.

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

 Shahzad Bhatti network, counterterror raids, Union Ministry of Home Affairs, Independence Day security, UAPA Act, Amitshh