TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం : హరీశ్‌రావు

Published on: Sat Sep 12, 2026 5:13PM

పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆర్టీసీ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో బస్సు ఛార్జీలను పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రయాణికులు పంపిన బస్‌ టికెట్లను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

హైదరాబాద్‌–హన్మకొండ మధ్య నడిచే ఏసీ బస్సు ఛార్జీ ఆగస్టు 20న రూ.410గా ఉండగా.. సెప్టెంబర్‌ 11న ఏకంగా రూ.570కు పెంచారని హరీశ్‌రావు తెలిపారు. అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం మోపారని పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఛార్జీలను భారీగా పెంచడం వల్ల ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆయన విమర్శించారు.

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజలకు తెలియకుండా, అకస్మాత్తుగా ఛార్జీలను పెంచడం ద్వారా ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలపై దోపిడీ పాలన’ అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఉచితాలు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మాటల్లో చెబుతూ.. మరోవైపు బస్సు ఛార్జీలను పెంచి సామాన్యులపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ‘మాటల్లో ఉచితాలు.. చేతల్లో ఛార్జీల మోత’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ప్రజలపై భారం మోపడం వెంటనే ఆపాలని, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై బస్సు ఛార్జీల పెంపు మరింత భారంగా మారుతుందని పేర్కొన్నారు. 

ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఛార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలపై మోపుతున్న అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించుకో వాలని, పెంచిన ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

 

 

[ RTC fare hike, Ganesh festivals, Harish Rao, CM Revanth reddy, Minister ponnam Prabhakar, TGRTC, KCR, KTR]