దేశంలోని డాలర్ల ప్రవాహం.. సూపర్ సక్సెస్ అయిన ఆర్బీఐ పథకం.!
Published on: Thu Sep 3, 2026 11:21AM

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభఉత్వం, ఆర్బీఐ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐ వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టిన యూఎస్ డాలర్, రూపాయి స్వాప్ పథకానికి ఎన్నారైల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రాథమిక గణాంకాల ప్రకారం ఆగస్టు 31 నాటికి దేశంలోకి ఏకంగా 136 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.30 లక్షల కోట్ల రూపాయలు వెల్లువలా వచ్చి పడ్డాయి.
డాలర్ల సమీకరణ ప్రయత్నాల్లో ఈ డాలర్, రూపీ స్వాప్ పథకం కొత్త చరిత్ర సృష్టించింది. ప్రవాస భారతీయులను భారతీయ కంపెనీలను మరింతగా ప్రోత్సహించి, దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పథకాన్ని జూన్ 8న ఆర్బీఐ ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రధానంగా మూడు విభిన్న మార్గాల ద్వారా ఈ నిధులను సమీకరించింది. ఒకటి ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు, రెండు భారతీయ కంపెనీలు విదేశాల నుంచి సేకరించిన రుణాలు, ఇక మూడోది.. ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ మార్గాలు. ఈ మూడు మార్గాలలో కలిపి సమీకరించిన మొత్తం 136 బిలియన్ డాలర్లలో సింహభాగం,

అంటే దాదాపు 93 శాతం ఎన్నారైల డిపాజిట్ల రూపంలోనే రావడం విశేషం. మిగిలిన విదేశీ నిధులలో విదేశీ రుణాల ద్వారా 5 బిలియన్ డాలర్లు, ఈసీబీల ద్వారా మరో 3.8 బిలియన్ డాలర్లు సమకూరాయి. ఈ పథకం ముగింపు దశకు వచ్చేసరికి స్పందన అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు 21 నాటికి 73 బిలియన్ డాలర్లుగా ఉన్న నిధుల ప్రవాహం, కేవలం చివరి 10 రోజుల్లోనే మరో 63 బిలియన్ డాలర్లు అదనంగా వచ్చి చేరింది.
ఈ స్పందన కారణంగా లక్ష్యం నిర్దేశిత గడువు కంటే ముందే సంపూర్ణంగా నెరవేరడంతో ఆర్బీఐ ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 30 గడువుకు బదులుగా, ఎఫ్‌సీఎన్ఆర్(బి) డిపాజిట్ల విండోను ముందస్తుగానే అంటే గత నెల 31కే ముగించింది. అయితే, మిగిలిన రెండు రుణ సమీకరణ మార్గాలు మాత్రం డిసెంబర్ 31 వరకు యథావిధిగా అందుబాటులో ఉండనున్నాయి.
2013లో ఆర్బీఐ ఇలాంటిదే ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పుడు కేవలం 26 బిలియన్ డాలర్లు మాత్రమే రాగా.. దానితో పోలిస్తే తాజా స్కీమ్ ఏకంగా ఐదు రెట్లకు పైగా నిధులను ఆకర్షించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ విదేశీ నిధుల రాకతో దేశ విదేశీ మారక నిల్వలు మరింత పటిష్టమై, అంతర్జాతీయంగా తలెత్తే చమురు ధరల పెరుగుదల, ఇతర ఆర్థిక ఒడిదొడుకుల నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థకు భద్రత లభిస్తుందని చెప్పవచ్చు.
[RBI scheme, NRI dollars, foreign currency inflows, RBI swap facility, FCNR deposits, Indian forex reserves]


