TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డయానా ప్రేమకథలో ట్విస్ట్: పాక్ లవర్‌తో ఆఫ్రికాకు వెళ్లాలనుకున్న రాకుమారి.!

Published on: Thu Sep 24, 2026 5:10PM

ప్రిన్సెస్ డయానా ఆత్మకథలో రహస్యం బయటపెట్టిన సోదరుడు.!

బ్రిటన్ రాజసౌధం అందించిన వైభవం, కిరీటం మోపిన హోదా ఆమెను ఎప్పుడూ సంతోషపెట్టలేదు. ప్రపంచమంతా ఆమెను ఓ అద్భుతమైన రాకుమారిగా చూసినా... ఆ అందమైన ముఖం వెనుక ఎవరికీ అంతుచిక్కని కన్నీటి గాథ, అంతులేని వ్యధ దాగి ఉంది. బ్రిటన్ రాకుమారి డయానా మరణించి మూడు దశాబ్దాలు కావస్తున్నా, ఆమె జీవితంలోని మర్మాలు మాత్రం ఇంకా వీడటం లేదు. తాజాగా డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ విడుదల చేసిన తన ఆత్మకథ ‘స్వాన్ సాంగ్: డయానా మై సిస్టర్’ ద్వారా వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

రాచరికపు నిబంధనలను, కట్టుబాట్లను ఎదిరించి... ఓ పాకిస్తానీ హార్ట్ సర్జన్ ప్రేమలో ఆమె పడిన తపన సాధారణమైనది కాదు. ప్రిన్స్ చార్లెస్ తో విడాకుల తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తున్న డయానాకు, పాకిస్తాన్‌కు చెందిన గుండె శస్త్రచికిత్స వైద్యుడు హస్నత్ ఖాన్ ఒక్కడే తన ప్రపంచంగా కనిపించారు. ఆయనను ముద్దుగా ‘డిషి డాక్టర్’ అని పిలుచుకుంటూ, రెండేళ్లకు పైగా రహస్యంగా ఆయనతో డేటింగ్ చేశారు. బ్రిటన్‌లో కొనసాగుతున్న నరకప్రాయమైన, ఉక్కిరిబిక్కిరి చేసే జీవితం నుంచి బయటపడి, తన ప్రియుడితో కలిసి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె కలలు కన్నారు. అక్కడితో ఆగకుండా, ప్రపంచంలోనే తొలిసారిగా గుండె మార్పిడి చేసిన ప్రఖ్యాత వైద్యుడు క్రిస్టియన్ బర్నార్డ్‌ను డయానా స్వయంగా ఆశ్రయించారు. 

కేప్‌టౌన్‌లోని గ్రూడ్ షూర్ ఆసుపత్రిలో హస్నత్ ఖాన్‌కు ఓ మంచి ఉద్యోగం కల్పించాలని ఆమె అభ్యర్థించారు. తన ప్రియుడితో కలిసి అక్కడ ప్రశాంతంగా జీవించగలనా లేదా అని తెలుసుకోవడానికి ఆమె స్వయంగా కేప్‌టౌన్‌ను సందర్శించారు.అయితే, ఈ ప్రేమకథలో బయటపడిన నిజాలు మరింత హృదయ విదారకరంగా ఉన్నాయి. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో డయానా మానసిక వేదన మరింత ఎక్కువైందని, ఆమెకు ఉన్న ‘ఈటింగ్ డిజార్డర్’ వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చిందని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియుడు హస్నత్ ఖాన్ ఎప్పుడు ఫోన్ చేస్తాడోనని ఆమె గంటల తరబడి కంటి మీద కునుకు లేకుండా నిరీక్షించేవారట. ఫోన్‌ను చేతిలో పట్టుకునే నిద్రలేచే ఆ రాకుమారి వేదన ఎవరినీ కంటతడి పెట్టించక మానదు. కానీ, బిజీగా ఉండే ఖాన్ మాత్రం చాలా అరుదుగా ఫోన్ చేసేవాడు. డయాపన్‌కు వెళ్లి ఖాన్ కుటుంబాన్ని సైతం కలిసిన డయానా, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. 

కానీ హస్నత్ ఖాన్ అందుకు అంగీకరించలేదు. కాలక్రమేణా డోడీ అనే మరో వ్యక్తితో డయానా పరిచయం పెంచుకోవడం ఖాన్‌కు నచ్చకపోవడంతో, వారిద్దరి మధ్య దూరం పెరిగింది. పారిస్‌లో జరిగిన ఆ దురదృష్టకర కారు ప్రమాదంలో డయానా ప్రాణాలు కోల్పోవడానికి ముందే ఈ విషాద ప్రేమకథ ముగిసిపోయింది. రాచరికపు ముసుగులో ఊపిరాడక సతమతమైన ఓ సున్నితమైన మనసు... ప్రేమ కోసం పడిన తాపత్రయం, దక్కిన నిరాశ డయానా జీవితాన్ని ఎంతగా కుదిపేసాయో ఈ గాథ స్పష్టం చేస్తోంది. హోదాలు, అంతస్తులు ముఖ్యం కాదని, మనశ్శాంతి, నిజమైన ప్రేమ కోసమే తపించిన ఆ రాకుమారి జీవితం చరిత్రలో ఎప్పటికీ ఓ తీరని విషాదంగానే మిగిలిపోతుంది.

 

 

[ Princess Diana, Hasnat Khan, Charles Spencer, Royal Family, Historical Secrets, Swan Song Diana My Sister, Diana's secrets, Prince Charles, Cape Town, Diana's death, Royal Family mystery ]