పోలవరం ప్రాజెక్టు ను పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం: ఆనకట్టల భద్రత, స్కాడా వ్యవస్థలపై తనిఖీలు.!
Published on: Sun Nov 29, 2026 4:57AM
.webp)
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణ భద్రతపై కేంద్ర సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)కి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం {నవంబర్ 28) తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు వచ్చిన ఈ బృందంలో ఎన్‌డీఎస్‌ఏ సదరన్ జోన్ డైరెక్టర్ గిరిధర్, డిప్యూటీ డైరెక్టర్ హేమాదిత్య ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, ఆనకట్టల పటిష్టత కోసం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో అమలు చేయబోయే పర్యవేక్షణ విధానాలపై వారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పర్యటనలో భాగంగా ఉదయం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ఎన్‌డీఎస్‌ఏ అధికారులకు జలవనరుల శాఖ ఇంజినీర్లు మోడల్ ద్వారా ప్రాజెక్టు పూర్తి స్వరూపాన్ని వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలు, వివిధ విభాగాల్లో జరుగుతున్న పనుల ప్రస్తుత స్థితి, మిగిలిన లక్ష్యాల పురోగతిని తెలియజేశారు. అనంతరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర నివేదికను అందించారు. ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ) పి.రామచంద్రరావు విభాగాల వారీగా సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా ఎన్‌డీఎస్‌ఏ బృందం ముందుంచారు.
అనంతరం ప్రతినిధి బృందం ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన స్పిల్‌వే, గ్యాప్1, గ్యాప్2, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాలను నేరుగా సందర్శించింది. నిర్మాణ ఆరంభ దశ నుంచి ఆనకట్ట భద్రతకు పెద్దపీట వేస్తూ తీసుకుంటున్న సాంకేతిక జాగ్రత్తలను ఎస్‌ఈ రామచంద్రరావు బృందానికి వివరించారు. వివిధ కట్టడాల వద్ద భద్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంటేషన్ పరికరాలను అమర్చినట్లు తెలిపారు. ఆ పరికరాల పనితీరు, వాటి ద్వారా నమోదవుతున్న డేటా వివరాలపై ఎన్‌డీఎస్‌ఏ అధికారులు ఆరా తీయగా, సంబంధిత సాంకేతిక అంశాలను అధికారులు ప్రజెంటేషన్ రూపంలో స్పష్టం చేశారు.

ప్రాజెక్టు భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పరిధిలోని సెన్సార్లు, మీటర్లు, వాల్వులు వంటి పరికరాల నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని స్కాడా వ్యవస్థ సేకరిస్తుందని వివరించారు. దీనివల్ల ఆనకట్టల పనితీరులో ఏవైనా మార్పులు సంభవిస్తే తక్షణమే గుర్తించి, నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సమర్థంగా స్పందించేందుకు రూర్కీ ఐఐటీ నిపుణులు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తున్నారని, అది సిద్ధమైన వెంటనే ఎన్‌డీఎస్‌ఏకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నీటితో నడిచే మెగా బ్యాటరీగా పోలవరం.. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ.!
ఆనకట్టల భద్రతా చట్టం-2021 అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌ల భద్రతపై ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలు, సలహాలు జారీ చేస్తోంది. సాధారణంగా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులను మాత్రమే ఈ అథారిటీ తనిఖీ చేస్తుంటుంది. అయితే, పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యత, భారీ నిర్మాణ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలతో నిర్మాణ దశలోనే ఎన్‌డీఎస్‌ఏ బృందం ఇక్కడ పర్యటించడం విశేషంగా నిలిచింది.

భారీ వరదలను తట్టుకుని నిలబడేలా, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని రాష్ట్ర ప్రజలు, రైతాంగం ఆశిస్తున్నారు. నిర్మాణ దశ నుంచే కేంద్ర భద్రతా సంస్థల పర్యవేక్షణ కొనసాగడం వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక మన్నికపై విశ్వాసం పెరుగుతుందని, భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు ఫలాలు అందుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మీకు నచ్చవచ్చు: పోలవరం ముంపు ప్రాంతాలకు రక్షణ చర్యలు చేపట్టాలి : హరీశ్‌రావు
వెలిగొండ, పొలవరం నీళ్లిస్తే జగన్ ఏడుపెందుకు
[Polavaram Project, NDSA, safety measures, SCADA system, Andhra Pradesh. Teloguone]


