రూల్ టేకర్స్ నుండి రూల్ షేపర్స్ స్థాయికి గ్లోబల్ సౌత్ ప్రయాణం.!
Published on: Tue Sep 15, 2026 4:42PM

ఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రపంచ జీడీపీలో నలభై శాతం వాటా, ప్రపంచ జనాభాలో సగం భాగం, అలాగే వాణిజ్యంలో నాలుగింట ఒక వంతు కలిగిన పదకొండు దేశాల శక్తిమంతమైన సమూహం తన ఆర్థిక సత్తాను సరికొత్త మార్గాల ద్వారా చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా సరిహద్దు చెల్లింపుల అనుసంధానం, ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగం, అలాగే స్వదేశీ చెల్లింపుల మౌలిక వసతుల విస్తరణే ధ్యేయంగా ఈ సదస్సు సాగింది. పశ్చిమ దేశాల కూటమి అయిన జీ-7 ప్రాముఖ్యతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే ప్రశ్నించగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం గ్లోబల్ సౌత్ దేశాలు ఇప్పటివరకు ఉన్న రూల్ టేకర్స్ స్థితి నుండి భవిష్యత్తును నిర్ణయించే రూల్ షేపర్స్ స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ కూటమి అనుసరిస్తున్న విధానాలు అమెరికన్ డాలర్‌కు పూర్తిగా వ్యతిరేకం కాదని, కేవలం దానిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు చేపట్టిన ఒక ఆచరణాత్మక ఆర్థిక వ్యూహం మాత్రమేనని స్పష్టమైంది.
ఈ అంతర్జాతీయ కూటమి ప్రయాణం వెనుక దశాబ్దాల చారిత్రక నేపథ్యం దాగి ఉంది. 2006లో కేవలం బ్రెజిల్, రష్యా, భారత్, చైనా దేశాల కలయికతో బ్రిక్ పేరుతో మొదలైన ఈ ప్రయాణం, 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత కాలక్రమేణా మరింత విస్తరించి, 2024 నాటికి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా వంటి దేశాలు కూడా పూర్తి స్థాయి సభ్యులుగా చేరాయి. ప్రస్తుతం పదకొండు పూర్తి స్థాయి సభ్య దేశాలు, తొమ్మిది భాగస్వామ్య దేశాలతో ఈ వేదిక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక కూటమిగా అవతరించింది. కొనుగోలు శక్తి సమానత్వం పీపీపీ ప్రాతిపదికన చూస్తే.. కేవలం ఇరవై నాలుగు శాతంగా ఉన్న ఈ దేశాల వాటా.. సుమారు నలభై శాతానికి ఎగబాకింది. అదే సమయంలో జీ-7 దేశాల వాటా నలభై ఐదు శాతం నుండి ఇరవై ఎనిమిది శాతానికి పడిపోవడం గమనార్హం.

సదస్సులో భాగంగా జరిగిన చర్చలు, గణాంకాలు బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య విస్తరణ వేగాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2003లోసంవత్సరంలో కేవలం ఎనభై నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్న బ్రిక్స్ అంతర్గత వాణిజ్యం, 2020నాటికి ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయినప్పటికీ, ప్రపంచ వాణిజ్య మొత్తంతో పోలిస్తే.. ఈ దేశాల మధ్య జరుగుతున్న అంతర్గత వ్యాపారం కేవలం ఐదు శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఈ లోటును పూడ్చివేయడమే ప్రధాన లక్ష్యంగా న్యూఢిల్లీ సదస్సులో సుదీర్ఘ కసరత్తు జరిగింది. రష్యా అధ్యక్షతన 2020లో ఏర్పాటైన బ్రిక్స్ చెల్లింపు టాస్క్ ఫోర్స్ (బీపీటీఎఫ్) చేసిన సిఫార్సులు, మాస్కో, కజాన్ రియో డిక్లరేషన్ల స్పూర్తిని కొనసాగిస్తూ ఈసారి న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు రూపకల్పన చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలు ఏకగ్రీవ ఆమోదం పొందాయి.
సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రసంగం పశ్చిమ దేశాల ఆర్థిక ఆధిపత్యంపై తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. జీ7 దేశాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగానికి పైగా బ్రిక్స్ దేశాలదే కీలక పాత్ర అనీ, కానీ పశ్చిమ దేశాలు మాత్రం తమ పాత ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నీచమైన మార్గాలను ఆశ్రయిస్తున్నాయని పుతిన్ ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ రవాణా మార్గాలను అడ్డుకోవడం, సముద్ర నౌకలను స్వాధీనం చేసుకోవడం, రష్యాపై మునుపెన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో ఆంక్షలు విధించడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అయితే.. పుతిన్ ఉదహరించిన గణాంకాలు కొనుగోలు శక్తి సమానత్వంపై ఆధారపడి ఉన్నాయని, మార్కెట్ మారకపు రేట్ల ప్రకారం చూస్తే జీ7 దేశాల వాటా ఇంకా బలంగానే ఉందనే వాదనలు కూడా ఆర్థిక నిపుణుల నుండి వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో గ్లోబల్ సౌత్ దేశాలు ముందు వరుసలో ఉంటున్నప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే క్రమంలో మాత్రం వెనుకబడిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు, అంతరిక్ష విజ్ఞానం, సైబర్ రంగం, బయోటెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలు భవిష్యత్తు నియమాలను మారుస్తున్నాయని, కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం నియమాలను పాటించే రూల్-టేకర్స్ గా కాకుండా, వాటిని రూపొందించే రూల్-షేపర్స్ గా మారాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని చెబుతూనే.. సమాన భాగస్వామ్యంతో కూడిన భవిష్యత్ నిర్మాణానికి ఆయన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు.
అంతర్జాతీయ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన డాలర్ ప్రశ్న పై కూడా ఈ సదస్సులో పూర్తి స్పష్టత లభించింది. బ్రిక్స్ దేశాలంటూ ప్రత్యేకంగా ఒకే ఒక సాధారణ కరెన్సీని తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సభ్య దేశాల మధ్య ద్రవ్యోల్బణ రేట్లు, వడ్డీ విధానాలు, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నందున ఒకే కరెన్సీ విధానం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీనికి బదులుగా.. పరస్పర వాణిజ్యంలో లావాదేవీల ఖర్చులను తగ్గించుకునేందుకు ఎవరి స్థానిక కరెన్సీలను వారు ఉపయోగించుకునే ఆచరణాత్మక విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడి నుండి వస్తున్న సుంకాల హెచ్చరికల నేపథ్యంలో.. డాలర్‌ను పూర్తిగా బహిష్కరించడం కాకుండా.. దానిపై ఉన్న అతిపెద్ద భారాన్ని తగ్గించుకోవడానికి ఈ వైవిధ్యీకరణ మార్గం ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
న్యాయపరమైన, నియంత్రణ పరమైన అంశాలపై కూడా న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో స్పష్టమైన తీర్మానాలు చేశారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఏకపక్షంగా విధించే బలవంతపు ఆంక్షలను, ద్వితీయ ఆంక్షలను కూటమి తీవ్రంగా ఖండించింది. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం వంటి వివక్షపూరిత వాణిజ్య పద్ధతులు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ, డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సరిహద్దు డిజిటల్ మోసాలు, ఆర్థిక నేరాలను అరికట్టేందుకు డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డిక్లరేషన్ నొక్కి చెప్పింది.
భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విదేశీ విధానం ఈ సదస్సులో స్పష్టంగా కనిపించింది. అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే, బ్రిక్స్ వేదికపై వర్ధమాన దేశాల గొంతుకను భారత్ గట్టిగా వినిపించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందని విమర్శించారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ద్వారా స్థానిక కరెన్సీలలోనే మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ఇక పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి వివాదాస్పద ప్రకటనలకు తావు ఇవ్వకుండా, అందరి ఆమోదయోగ్యమైన సంయమన ధోరణితోనే తీర్మానాలు రూపొందించడం విశేషం.
ఆచరణాత్మక ఫలితాల విషయానికి వస్తే, చెల్లింపు వ్యవస్థల అనుసంధానం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భారత్ తన యూపీఐ విధానాన్ని పలు దేశాలతో అనుసంధానించగా, డిజిటల్ రూపాయి లావాదేవీలను కూడా ప్రయోగాత్మకంగా విస్తరిస్తున్నారు. రష్యాతో జరిగే వాణిజ్యంలో అత్యధిక భాగం రూపాయి, రూబుల్ మారకం ద్వారానే జరుగుతుండటం గమనార్హం. అయితే, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీబడీసీ) అనుసంధానం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సభ్య దేశాల మధ్య సాంకేతిక ప్రమాణాలు, చట్టపరమైన నిబంధనలు పూర్తిగాఏక తాటిపైకి రావాల్సి ఉంది. మరోవైపు, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇప్పటివరకు అనేక ప్రాజెక్టులకు నిధులు కేటాయించినప్పటికీ, వాస్తవ లబ్ధి మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి.
అంతర్జాతీయ ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు కేవలం ఒక్కరోజులో జరిగేవి కాదనే స్పష్టత వచ్చింది. బ్రిక్స్ కూటమి దేశాల మధ్య భౌగోళిక రాజకీయ పరమైన భేదాభిప్రాయాలు, భారత్, చైనా మధ్య ఉన్న అంతర్గత విశ్వాస లోపాలు వంటి సవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. అయినప్పటికీ, ఏక ధ్రువ ప్రపంచ వ్యవస్థ నుండి బహు ధ్రువ ప్రపంచ వ్యవస్థ వైపు జరుగుతున్న పరిణామంలో ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలిచింది. డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కంటే, వాణిజ్య మార్గాలను సులభతరం చేయడం, చెల్లింపుల భారాన్ని తగ్గించడం మరియు గ్లోబల్ సౌత్ దేశాల గొంతును అంతర్జాతీయ వేదికలపై శక్తివంతంగా వినిపించడమే అసలైన విజయమని ఈ సదస్సు నిరూపించింది. భవిష్యత్తులో ఈ కూటమి తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక గతిశీలతను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది వేచి చూడాలి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[PM Modi, BRICS Speech, Local Currency, Trade Settlements, Vladimir Putin, G7 Remarks, New Delhi Declaration, Rule Takers, Rule, Shapers]


