TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డంపింగ్ యార్డుకు కొత్త రూపం.. పిఠాపురంలో పీఠికాపుర వనం..!

Published on: Mon Sep 21, 2026 8:08PM

ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రదేశం.. ఇప్పుడు పచ్చని మొక్కలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులను ఆకట్టుకునే నగర వనంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ‘పీఠికాపుర వనం’కు కొత్త హరిత రూపం సంతరించుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఈ నగర వనాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పిఠికాపుర వనానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. మొక్క నాటడంతో పాటు ప్రారంభానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నగర్ వన్ యోజన’ పథకం ద్వారా సుమారు రూ.1.83 కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు.

పిఠాపురానికి ఉన్న ప్రత్యేక ఆధ్యాత్మిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వనాన్ని ప్రత్యేక ఆకృతిలో తీర్చిదిద్దారు. ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసేలా నక్షత్రవనం, శివపంచాయతన వనాలను ఏర్పాటు చేశారు. నక్షత్రవనంలో 27 నక్షత్రాలకు ప్రతీకలుగా వివిధ రకాల మొక్కలను వరుస క్రమంలో నాటారు. ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర మొక్కలను పెంచుతున్నారు. ప్రతి మొక్కకు సంబంధించిన శాస్త్రీయ నామంతో పాటు సాధారణంగా వినియోగించే పేర్లను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేశారు.

నక్షత్రవనంలోని మొక్కలను పవన్ కళ్యాణ్ పరిశీలించి.. వాటి ప్రత్యేకతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శివపంచాయతన వనంలో మారేడు, వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడికి ప్రతీకలుగా భావించే మొక్కలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కార్తీక మాసం, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వీటికి ప్రదక్షిణలు చేసే సంప్రదాయానికి సంబంధించిన వివరాలను అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
నగర వనంలో మరో ప్రత్యేక ఆకర్షణగా 70 సెంట్ల విస్తీర్ణంలో ‘మియావకీ ఫారెస్ట్‌’ను అభివృద్ధి చేశారు. తక్కువ స్థలంలో అధిక సంఖ్యలో మొక్కలను పెంచి వేగంగా పచ్చదనాన్ని పెంచే విధానంలో ఈ చిట్టడవిని రూపొందించారు. సందర్శకులను ఆకట్టుకునేలా బటర్‌ఫ్లై పార్కును కూడా ఏర్పాటు చేశారు. వనం మధ్యలో నిర్మించిన భారీ కొలను మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భవిష్యత్తులో బాక్స్ క్రికెట్, ప్లే కోర్ట్స్ వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. పిఠాపురానికి వచ్చే స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ఆధ్యాత్మిక పర్యాటకులకు కూడా ఈ నగర వనం ఉపయోగపడేలా మరింత అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రకృతి, వినోదం, ఆధ్యాత్మికత కలిసేలా వనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.నగర వనం ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది.. ప్రస్తుతం ఏ విధంగా మార్పు చెందిందో తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 

డంపింగ్ యార్డు నుంచి పచ్చని నగర వనంగా ఈ ప్రాంతం మారిన తీరును, అందుకు చేసిన కృషిని అధికారులు వివరించారు.పీఠికాపుర వనం రూపుదిద్దుకోవడానికి కృషి చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ‘నగర్ వన్ యోజన’ పథకం సహకారంతో రాష్ట్రంలోని పలు పట్టణాల్లో నగర వనాల అభివృద్ధి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.36 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 18 నగర వనాలను ఇటీవల ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పిఠాపురంలో తాజాగా అందుబాటులోకి వచ్చిన ‘పీఠికాపుర వనం’ ఈ హరిత అభివృద్ధిలో మరో ముందడుగుగా నిలిచింది.

 

[ Pithapuram, Peethikapuram Vanam, Pawan Kalyan, Deputy CM Pawan Kalyan, Urban Forest, Nagar Van Yojana, Pithapuram Urban Forest, Andhra Pradesh, Forest Department, Miyawaki Forest, Butterfly Park, Nakshatra Vanam, Shiva Panchayatana Vanam, Green Development, Urban Greening, AP Forest Department ]