TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గురువే హంతకుడు : అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

Published on: Mon Sep 21, 2026 5:15PM

పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ మైనింగ్ చదువుతున్న అక్షితారాణి మృతి వెనుక ఆమె పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్ హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన అక్షితారాణి, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌లో 2022లో డిప్లొమా పూర్తి చేసింది. ఆ సమయంలో వారి గ్రామస్థుడైన జెట్టి నవీన్‌కుమార్ అదే కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరిది ఒకే ఊరు కావడంతో నవీన్‌కుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న నవీన్‌కుమార్, అక్షితారాణిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

ఆ తరువాత అక్షితారాణి ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ మైనింగ్‌లో చేరింది. ఆమె కుటుంబం గోదావరిఖనికి మారాక, బొగ్గు గనుల్లో 12 రోజుల ఇంటర్న్‌షిప్ కోసం జనవరిలో అక్కడ చేరింది. ఆ గనిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్, తాను కూడా నస్పూర్‌ పాలిటెక్నిక్‌లోనే చదివానని, నవీన్‌కుమార్‌కు శిష్యుడినని చెప్పి ఆమెకు పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత రవికుమార్ ఆమెను లైంగికంగా వేధించడంతో, అక్షితారాణి సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాన్యం విచారణ కమిటీ వేసి రవికుమార్‌ది తప్పులేదని తేల్చింది. ఆ తర్వాత రవికుమార్ బాధితురాలిని లొంగదీసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న లెక్చరర్ నవీన్‌కుమార్ తీవ్ర అసూయకు, కక్షకు గురయ్యాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేసి, సెప్టెంబర్ 12న ఆమెను కారులో ఎక్కించుకుని బలవంతంగా పురుగుమందు తాగించాడు. అనంతరం ఆమెతో ఒక సూసైడ్ నోట్ రాయించి, ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అక్షితారాణి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె ఫోన్ నుండి తండ్రికి ఫోన్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి నవీన్ పరారయ్యాడు.

చికిత్స పొందుతూ అక్షితారాణి సెప్టెంబర్ 13న మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీలు, కాల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్‌తో పాటు, అత్యాచారం కేసులో నిందితుడైన సూపర్‌వైజర్ బొమ్మకంటి రవికుమార్‌ను కూడా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

 

 

[ Peddapalli engineering student murder, Akshita rani case, Lecturer arrested peddapalli, Telangana student death, Bommakanti ravi kumar, Singareni internship case, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy, Godavarikhani police ]