TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Osmania University: క్యాంపస్‌లో గంజాయి కలకలం..!

Published on: Thu Oct 1, 2026 2:10PM

ఒకవైపు వేలాది మంది విద్యార్థుల చదువులు.. మరోవైపు పచ్చదనంతో కళకళలాడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌.. అలాంటి ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. .ఉస్మానియా యూనివర్సిటీకి పచ్చదనంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. యూనివర్సిటీ అధికారిక సమాచారం ప్రకారం క్యాంపస్‌లో విస్తారమైన గ్రీన్‌ కవర్‌తో పాటు ఉద్యానవనాలు, గ్రీన్‌బెల్ట్ ప్రాంతాలు ఉన్నాయి. క్యాంపస్‌లోని వృక్షజాలంపై నిర్వహించిన అధ్యయనంలో 839 రకాల మొక్కల జాతులు నమోదైనట్లు వెల్లడైంది. ఇలాంటి పచ్చని ప్రాంగణంలో ఇప్పుడు గంజాయి మొక్క కనిపించడం ఆసక్తికరంగా మారింది. సహజంగానే మొలిచిందా? లేక ఎవరైనా కావాలనే నాటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరైనా గంజాయి సిగరెట్‌ లేదా విత్తనాలను అక్కడ పడేయడంతో మొక్క మొలిచిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్యాంపస్‌లో కనిపించినది ఒక్క మొక్కేనా? మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి మొక్కలు ఉన్నాయా? అన్నదానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశాలమైన క్యాంపస్‌లోని పచ్చదనం, పొదలు, ఖాళీ ప్రదేశాలు, ఉద్యానవన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే అసలు పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు నిత్యం సంచరించే ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తం కావాలని విద్యార్థులు కోరుతున్నారు. క్యాంపస్‌లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి.. ఇలాంటి మొక్కలు మరెక్కడైనా ఉన్నాయా అన్నది గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.అసలు ఈ మొక్క అక్కడ ఎలా పెరిగింది?  అనే అంశాలపై యూనివర్సిటీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? క్యాంపస్‌లో పూర్తిస్థాయి తనిఖీలు చేపడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

 

 

 

[ Osmania University campus, Marijuana, Marijuana cigarette, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]