సీమకు రైల్వే కనెక్టివిటీ.. 2వేల 505 కోట్లతో కొత్త రైల్వేలైన్.!
Published on: Sat Sep 5, 2026 2:23PM

రాయలసీమలో రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే లక్ష్యంతో కీలక నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరమయ్యాయి. కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలను అనుసంధానిస్తూ సరికొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా కడప జిల్లాలోని ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ 110 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ వేయనున్నారు. 2 వేల 505 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డీపీఆర్ రెడీ అయ్యింది. ఈ డీపీఆర్ కేంద్ర రైల్వే బోర్డు పరిశీలన దశలో ఉంది.
సీమలో దశాబ్దాలుగా రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు ఈ రైల్వే ప్రాజెక్టు వరంగా మారనుంది. ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ ముద్దనూరు నుంచి ప్రారంభమై పులివెందుల, ముదిగుబ్బ మీదుగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వరకు సాగుతుంది. దీని ద్వారా రాయలసీమ ప్రాంతం నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే రాయలసీమ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణ సమయం, దూరం గణనీయంగా తగ్గనున్నాయి.

నిత్యం ఉద్యోగాలు, చదువులు మరియు వివిధ వ్యాపారాల నిమిత్తం బెంగళూరుకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులకు ఈ రైల్వే లైన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణీకుల రాకపోకలకే కాకుండా, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి. పారిశ్రామిక రంగ పురోగతికి ఈ రైల్వే లైన్ వెన్నెముకగా నిలుస్తుంది. కడప, ఉమ్మడి అనంతపురం పరిసర ప్రాంతాలలో విస్తారంగా సాగవుతున్న అరటి, బత్తాయి, మామిడి, చీనీ వంటి ఉద్యానవన పంటల రవాణాకు ఈ రైల్వే లైన్ దోహదం చేస్తుంది. దీనివల్ల రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు, ముఖ్యంగా మెట్రో మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గ్రానైట్, సిమెంట్, మైనింగ్, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. పుట్టపర్తి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లే యాత్రికులకు, పర్యాటకులకు కూడా ఈ రైలు మార్గం ద్వారా ప్రయాణం సులభతరం అవుతుంది.
[New Railway Line Rayalaseema, Muddanur Mudigubba Railway, Pulivendula Railway Line, Kadapa Bangalore Train, AP New Railway Projects, Puttaparthi Train Route, Rayalaseema Railway Development]


