అడిగింది ఆడదే.. న్యాయం జరగాలని: నెక్లెస్ రోడ్డుపై అర్ధరాత్రి మహిళలు నిరసన.!
Published on: Sun Oct 4, 2026 2:29PM

మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మరోసారి అర్ధరాత్రి సందేశాలతో మార్మోగింది. శనివారం రాత్రి మహిళలు, క్వీర్ కమ్యూనిటీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి “మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు స్వేచ్ఛగా సంచరించే హక్కును చాటిచెప్పడమే ఈ మార్చ్ ప్రధాన ఉద్దేశం. మహిళల భద్రత పేరుతో వారినే ఇంటికే పరిమితం చేయడం కాకుండా.. రాత్రి వేళల్లోనూ మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం సాగింది.“ఈ రోడ్లు పురుషులకేనా..?ఈ నగరం పగటి పూట మాత్రమే మాదా..?రాత్రి అయితే మహిళలు ఎందుకు భయపడాలి..?” అంటూ మిడ్నైట్ మార్చ్ ద్వారా ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్‌లో మిడ్నైట్ మార్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. 2013లో ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో మిడ్నైట్ మార్చ్ నిర్వహించారు. అప్పట్లో నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని.. మహిళలు అర్ధరాత్రి వేళల్లోనూ బహిరంగ ప్రదేశాలను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు తమదేనని చాటిచెప్పారు.ఆ ఉద్యమం కేవలం ఓ నిరసనగా మాత్రమే కాకుండా.. “మహిళలు రాత్రి వేళల్లో బయటకు రావద్దు” అనే సామాజిక భావనకు సవాల్‌గా నిలిచింది. మహిళలకు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని వారిపైనే ఆంక్షలు విధించడం కంటే.. వేధింపులకు పాల్పడే వారిని ప్రశ్నించాలన్న ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది.
.webp)
ఈ కార్యక్రమంలో క్వీర్ కమ్యూనిటీతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు. మహిళల భద్రతతో పాటు లింగ గుర్తింపుల కారణంగా అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి ఒక్కరికీ బహిరంగ ప్రదేశాల్లో సమాన హక్కులు ఉండాలన్న సందేశాన్ని వినిపించారు. ఏళ్లు గడిచాయి.. నగరం మారింది.. జీవన విధానం మారింది.. కానీ రాత్రి వేళల్లో మహిళల స్వేచ్ఛ, భద్రత, సమాన హక్కుల ప్రశ్న మాత్రం ఇంకా చర్చకు వస్తూనే ఉంది. అందుకే మరోసారి నెక్లెస్ రోడ్డుపై అర్ధరాత్రి అడుగులు పడ్డాయి.కాలం మారినా.. ఈ గోస మారదా..?అడిగింది ఆడదే..దానం కాదు.. హక్కు కావాలని.! జాలి కాదు.. న్యాయం కావాలని.!ఆంక్షలు కాదు.. స్వేచ్ఛ కావాలని.! అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డుపై వినిపించిన ఈ గొంతుక.. కేవలం ఓ రాత్రి నినాదం కాదు. నగరంలోని బహిరంగ ప్రదేశాలు ఎవరివి? మహిళలు రాత్రి వేళల్లోనూ భయంలేకుండా తిరిగే హక్కు ఎప్పుడు పూర్తిగా సాధ్యమవుతుంది? అనే కీలక ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చిన ఉద్యమం.
.webp)
[ Midnight March, Hyderabad, Necklace Road, Women Rights, Women Safety, Gender Equality, Reclaiming Public Spaces, LGBTQ Community, Queer Community, Women Empowerment, Public Spaces, Night Safety, Hyderabad Women, Gender Justice, Women's Freedom ]


