ఏసీబీ వల: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారుల పట్టివేత.!
Published on: Thu Nov 5, 2026 5:32PM

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా పట్టుబడ్డారు. గురువారం నిర్వహించిన ఈ దాడిలో జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి (AO-1), అదే కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టైపిస్టుగా పనిచేస్తున్న శ్రీ గోరె ఉమేష్ (AO-2) ఏసీబీ అధికారులకు చిక్కారు.
మహబూబ్‌నగర్‌లోని ఎస్ఏటీజీ వాలీబాల్ హాస్టల్లో ఉంటున్న క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 2026 నెలకు సంబంధించిన రూ.3.10 లక్షల క్యాటరింగ్ బిల్లు ప్రాసెస్ చేసి, చెక్కు విడుదల చేయించేం దుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష ఇవ్వాలని కోరినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ క్రమంలో లంచం సొమ్మును స్వీకరిస్తుండగా ఏసీబీ మహబూబ్‌నగర్ రేంజ్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.లక్ష నగదును ప్రధాన నిందితుడు జక్కు రాజశేఖర్ రెడ్డి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెండో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనే అభియోగాలపై ఇద్దరినీ అరెస్టు చేసి, నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇచ్చింది.
[ Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News ]


