DJ Sound Effect: క్లాస్‌రూమ్‌లో కుప్పకూలిన పాప..మృతి.!
Published on: Wed Sep 23, 2026 4:50PM

పండుగ వేడుకలు, గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ డీజే సౌండ్ సిస్టమ్స్ హోరు సర్వసాధారణమైపోయింది. అయితే ఈ శృతిమించిన శబ్దాలు ఆనందాన్ని పంచుతుండాల్సిందిపోయి, ఇళ్లల్లో విషాదాన్ని నింపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హై డెసిబుల్స్‌తో మోగుతున్న భారీ డీజే సౌండ్‌లు పసిపిల్లల నుంచి యువకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గడిచిన కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఘటనల్లో ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. స్థానిక డివైన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 8 ఏళ్ల రెండో తరగతి చిన్నారి వైష్ణవి తివారీ స్లాస్ రూమ్‌లో పాఠాలు వింటున్న సమయంలో.. పాఠశాల వెలుపల నుంచి వెళ్తున్న గణేష్ నిమజ్జన ఊరేగింపులోని మితిమీరిన డీజే మోతల ధాటికి అకస్మాత్తుగా క్లాస్ రూమ్‌లోనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కు పరిమితం కాలేదు. సరిగ్గా ఇదే తరహా విషాదాలు తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తున్నాయి. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో శనివారం రాత్రి జరిగిన గణేష్ ఆగమన్ ఊరేగింపులో 19 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఎస్. బద్రీనాథ్ డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. భారీ జనసమ్మర్ధం, ఊపిరాడని వాతావరణం, చెవులు చిల్లులు పడేలా హోరెత్తిన డీజే మోతే బద్రీనాథ్ మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. డీజేల వల్ల నిండు ప్రాణాలు పోతున్నాయని, వెంటనే వీటిపై నిషేధం విధించాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే నారాయణపేట జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకలో డీజేకు డ్యాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని తాడేపల్లిగూడెంలోనూ వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే పాటలకు స్టెప్పులేస్తూ 48 ఏళ్ల కాకర్లమూడి ఏసు మృతి చెందారు. ఇలా కేవలం రెండు రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం సాధారణంగా 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం మానవ గుండె లయను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గుండె బలహీనత ఉన్నవారికి ఇది అత్యంత ప్రాణాంతకం. అయితే ఎటువంటి నిబంధనలను పాటించకుండా కొందరు ఏకంగా 100 నుంచి 120 డెసిబుల్స్ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రమాదకర ధోరణిపై ఇప్పటికే పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి, హై డెసిబుల్ సౌండ్ సిస్టమ్స్‌పై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కఠిన నిబంధనలు అమలు కాకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి. పండుగ సంబరాలు సంతోషాన్ని పంచాలి కానీ, ఇలా అమాయక ప్రాణాలను బలిగొనేలా ఉండకూడదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డీజేల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
[ loud dj sound tragedy, ganesh visarjan djs, 8 year old girl death, high decibel dj danger, telugu states news, heart attack while dancing dj, Crime news, Telugu One, Telugu News ]


