TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతిలోరూ. 212.22 కోట్ల వ్యయంతో లోక్ భవన్.!

Published on: Tue Sep 1, 2026 11:56AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన  లోక్ భవన్ (గవర్నర్ నివాస సముదాయం) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  పాలనాపరమైన  ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణం కోసం రూ. 212.22 కోట్లు  కేటాయిస్తూ  ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.  

 గవర్నర్ అధికారిక నివాసమైన మ్యాన్షన్‌తో పాటు, శాసనసభ దర్బార్ హాల్, పరిపాలనా కార్యాలయం, ప్రముఖుల కోసం రెండు విఐపి అతిథి గృహాలు కూడా లోక్ భవన్ సముదాయంలో  భాగం కానున్నాయి. ఇవే కాకుండా లోక్ భవన్ అధికారులు, సిబ్బంది పరిపాలనా అవసరాల కోసం ప్రాంగణంలోనే ప్రత్యేక నివాస గృహాలను నిర్మించనున్నారు.

భద్రతా సిబ్బంది,  ఉద్యోగుల కోసం ప్రణాళికను రూపొందించారు. ఇందులో అధికారులు, సీనియర్, జూనియర్,  సహాయక సిబ్బంది కోసం వేర్వేరు క్వార్టర్లను కేటాయిస్తారు. రక్షణ విభాగాల కోసం 20 గదులతో కూడిన బ్యారక్ లు కూడా ఉంటాయి.  ఇక్కడ సుమారు 144 మంది భద్రతా సిబ్బంది బస చేయడానికి వసతి ఉంటుంది. నాలుగు సెంటీనల్ పోస్టులతో బలమైన కాంపౌండ్ వాల్, అనుబంధ చెక్ పాయింట్లతో ఆర్సీసీ విధానంలో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

అయితే ఈ నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ కొన్ని షరతులు విధించింది. ప్రాజెక్ట్ నిర్మాణం నిర్ణీత అంచనా వ్యయమైన రూ. 212.22 కోట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. ఈ నిర్మాణ వ్యయాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ  సీఆర్డీయే  సొంత నిధుల నుంచే సర్దుబాటు చేసుకోవాలి.  ప్రభుత్వం నుండి అదనపు బడ్జెట్ కేటాయింపులు ఉండవు. 

ఆక సాంకేతిక అనుమతులు, టెండర్ల వ్యయం సహా సమగ్ర వ్యయం కేటాయించిన బడ్జెట్ లోనే  పూర్తి కావాల్సి ఉంటుంది. నిర్మాణ ప్రక్రియలో నిధులు మిగిలినా వాటిని ఇతర పనులకు మళ్లించడానికి వీల్లేదు.   

 

[Lok Bhavan complex in Amaravati, Amaravati  Raj Bhavan, AP Government, Lok Bhavan complex, CRDA funds, Amaravati constructions]