థియేటర్‌లో ప్యారడైజ్ మూవీ చూసిన కేటీఆర్: రివ్యూ ఇదే.!
Published on: Sun Sep 27, 2026 11:52AM

గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మోస్ట్ అంటెసిపేటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు స్వయంగా వెళ్లడం తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం తర్వాత కేటీఆర్ థియేటర్‌లో సినిమా చూసేందుకు రావడం నాని అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.

సినిమా వీక్షించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ 'ది ప్యారడైజ్' చిత్రంపై తన మనసులోని మాటను, రివ్యూను పంచుకున్నారు. తెలంగాణ నేల, యాస, భాష, అలాగే ఇక్కడి సాంస్కృతిక అస్తిత్వాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరపై అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించారని కొనియాడారు. అణగారిన వర్గాల ప్రజల కష్టాలను, వారి జీవన పోరాటాలను సినిమా ముందుకు తీసుకువచ్చిన విధానం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తమ ఉనికికి, హక్కులకు ప్రమాదం వాటిల్లినప్పుడు ప్రజలు ఏవిధంగా తిరుగుబాటు చేస్తారో, వారి వెనుక నిలబడి న్యాయం కోసం పోరాడే నాయకుడి పాత్రను చిత్రంలో ఎంతో సహజంగా చూపించారని కేటీఆర్ పేర్కొన్నారు.గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.
ఈ కథ వెనుక ఉన్న వాస్తవ సంఘటనల స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకోగలరని తెలిపారు. తెలంగాణ నేటివిటీ, ఇక్కడి నిజమైన యాస సినిమా స్థాయిని మరింత పెంచాయని, నిరంతర అణచివేతకు గురవుతున్న సమాజంలో సామూహిక ప్రతిఘటన ఎలా రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని ఈ చిత్రం అద్దం పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. హీరో నాని, నటుడు ప్రియదర్శి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు మొత్తం చిత్ర యూనిట్ ఈ విభిన్నమైన సబ్జెక్ట్‌ను అద్భుతమైన సినిమా అనుభూతిగా మలచడంలో పూర్తిగా విజయవంతమయ్యారని అభినందించారు.
[ KTR The Paradise review, Nani The Paradise movie, KTR watches Paradise, Srikanth Odela movie, Tollywood news, Sudarshan theatre Hyderabad, Telugu One, Telugu News ]


