TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిమజ్జనం వేళ విషాదం: బందోబస్తుకు వచ్చి ఎస్‌ఐ మృతి.!

Published on: Thu Sep 24, 2026 3:54PM

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జన బందోబస్తు విధుల కోసం హైదరాబాద్‌‌కు  వచ్చిన ఓ ఎస్సై రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో విషాదాన్ని నింపింది.  కొత్తగూ డెం టూ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా కునుసోతు వెంకన్న (57)  విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో బందోబస్తు విధుల కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో నిన్న అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో నెక్లెస్ రోడ్‌ వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం అత్యంత వేగంగా వచ్చి వెంకన్న ను ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాదంలో మేజర్ గాయాలు కావడంతో తీవ్ర నొప్పులతో వెంకన్న ఇబ్బందిపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు వెంకన్నకు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విష మించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వెంకన్న కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఎస్సై ఇలా ప్రమాదంలో మృతి చెందడంతో సహచర పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 

నెక్లెస్ రోడ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్సై వెంకన్న మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సహచరులు  శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ దుర్ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం ప్రకటించారు. ఎస్సై వెంకన్న అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పెను విషాద సమయంలో బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా సంపూర్ణంగా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి అధికారి ప్రాణాలు తీసిన నిందితుడిని గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.