ముందు కార్పొరేటర్‌గా గెలువు.. బస్వరాజు సారయ్యకు కొండా సురేఖ సవాల్..!
Published on: Sun Sep 13, 2026 5:15PM

మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాలలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ఊహాగానాలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో తన భర్త కొండా మురళితో కలిసి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించామని, భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో కొనసాగుతామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆమె పునరుద్ఘాటించారు.
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై మాట్లాడిన కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోల్పోయినందుకు తనకు వ్యక్తిగతంగా ఎటువంటి బాధ లేదని, అయితే తొలగింపునకు గల సరైన కారణాన్ని అధిష్ఠానం వివరించకపోవడమే తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పార్టీ అధిష్ఠానం నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో త్వరలోనే తన భర్త కొండా మురళికి సముచితమైన పదవి లభిస్తుందనే సంకేతాలు అధిష్ఠానం నుంచి అందినట్లు ఆమె వెల్లడించారు.
ఈ సమావేశంలో ఆమె స్థానిక రాజకీయ ప్రత్యర్థులపై పరోక్ష విమర్శలు గుప్పించారు. పార్టీలో ఉంటూ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ ప్రధాన లక్ష్యమని కొండా సురేఖ ప్రకటించారు. భవిష్యత్తులో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొంది, మరింత బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బసవరాజు సారయ్య, నాయిని రాజేందర్ రెడ్డిలపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైక్ చూసి చాలా రోజులైందని.. మైక్ కనిపించగానే ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని బసవరాజు సారయ్య అంటున్నారని కొండా సురేఖ అన్నారు. ముందు తన అనుచరులపై కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలని సవాల్ చేశారు.
ఇక నాయిని రాజేందర్ రెడ్డిపై కూడా కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వినయ్ భాస్కర్‌ను తట్టుకోలేక నియోజకవర్గంలోని కార్యక్రమాలకు తమను బతిమాలి తీసుకెళ్లేవారని ఆరోపించారు. భద్రకాళి ఆలయ పదవి విషయంలో గతంలో హంగామా చేసిన నాయిని రాజేందర్ రెడ్డి.. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి విషయంలోనూ ఇదే పరిస్థితి ఎందుకని కొండా సురేఖ నిలదీశారు. తనపై, తన అనుచరులపై విమర్శలు చేసే ముందు గతంలో వారి వ్యవహారాలను గుర్తు చేసుకోవాలని సూచించారు.
[ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Basavaraj Saraiah, Naini Rajender Reddy, Telugu One, Telugu News]


