కొల్లూరులో రూ.90 కోట్ల భూ కుంభకోణం.. భూభారతి ఆపరేటర్ సహా నలుగురు అరెస్ట్.!
Published on: Sun Nov 8, 2026 3:31PM

తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారిన కొల్లూరులో ఏకంగా రూ.90 కోట్ల విలువైన భూ అక్రమాల వ్యవహారం బయటపడింది. మూడు ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేసిన కేసులో సీఐడీ అధికారులు భూభారతి పోర్టల్ ఆపరేటర్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. భూ రికార్డుల ట్యాంపరింగ్‌లో పోర్టల్ లాగిన్ వివరాలను దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు.. భూభారతి ఆపరేటర్ అరెస్ట్.!
ఈ కేసులో దాడే శివ, మంగళి రాజేందర్, దాడే పవన్ కల్యాణ్, ఎ. మహేష్‌లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో గత జులైలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో అక్రమ మ్యుటేషన్ వ్యవహారం వెలుగులోకి రావడంతో శనివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మూడు ఎకరాల భూమిపై అక్రమ మ్యుటేషన్.!
కొల్లూరు పరిధిలోని మూడు ఎకరాల భూమిని బి. వినోద్ కుమార్ పేరిట రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ప్రక్రియ కోసం వినోద్ కుమార్ ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, క్షేత్రస్థాయి విచారణ కూడా జరగలేదని తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కనీసం కార్యాలయ వర్క్ఫ్లోలోనూ దరఖాస్తు నమోదు కాకుండానే భూ రికార్డుల్లో మార్పులు జరగడం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది.
భూభారతి నిబంధనలు బేఖాతర్.. లాగిన్ వివరాలతో ట్యాంపరింగ్.!
భూభారతి చట్టం-2025 ప్రకారం భూముల మ్యుటేషన్‌కు ఆర్డీవో అనుమతి తప్పనిసరి. అయితే, ఈ నిబంధనలను పక్కనపెట్టి పోర్టల్‌లోని లాగిన్ వివరాలను దుర్వినియోగం చేసి భూ రికార్డులను మార్చినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్ లాగిన్ వివరాలను పరిశీలించే క్రమంలో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సిట్ విచారణతో వెలుగులోకి అక్రమాలు.!
ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం డీజీపీ ర్యాంక్ అధికారి చారు సిన్హా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సీఐడీ అధికారులు కేసును లోతుగా పరిశీలించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే, ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహాలో భూ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందా? మరెవరైనా ఈ అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కొల్లూరులో వెలుగుచూసిన ఈ రూ.90 కోట్ల భూ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల భద్రతపై మరోసారి చర్చకు తెరలేపింది.
[ Kollur Land Scam, Bhu Bharati Portal, Dharani Land Records, Telangana CID, Land Mutation Scam, ₹90 Crore Land Scam, Sangareddy, Land Record Tampering ]


