కేసీఆర్ ఫాంహౌస్ భూముల వివాదం.. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు..!
Published on: Thu Sep 17, 2026 5:15PM
.webp)
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రెవెన్యూ శాఖ అధికారులు అత్యంత వేగంగా రంగంలోకి దిగారు. గజ్వేల్ ఆర్డీఓ, మర్కుక్ ఎమ్మార్వో, ఏడీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఎర్రవల్లి, శివారు వెంకటపూర్, వరదరాజుపూర్ గ్రామాల సరిహద్దుల్లో భూముల పరిశీలన విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 325 సర్వే నెంబర్‌లోని అసైన్డ్ భూముల అంశంపై అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. 1944 నాటి సర్వే రికార్డుల ప్రకారం ఎర్రవల్లి గ్రామాన్ని ఆనుకొని మొత్తం 2,447 ఎకరాల భూమి ఉండగా, దాని సరిహద్దులో వెంకటాపురం గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల సరిహద్దుల మధ్య దాదాపు 300 ఎకరాల భూమి ఓవర్‌లాపింగ్‌లో నమోదై ఉండటం, ఆ వివాదం 1957 నుంచి నలుగుతుండటం గమనార్హం.

ఈ వివాదాస్పద భూముల లెక్కలపై శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ సమయంలో రికార్డులను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సరిగ్గా ఇదే అదనుగా భావించి, ఆ 300 ఎకరాలు కొనుగోలు చేసినట్లు కాగితాలు సృష్టించి ఒక్క కలం పోటుతో కేసీఆర్ యజమాని అయిపోయారని విమర్శించారు. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫాంహౌస్‌లో కేవలం 295 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు చూపించారని తెలిపారు. అయితే, రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో ఏకంగా 388 ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఉందని, 2017 నాటి డిలీషన్ అండ్ అప్‌డేషన్ పేరుతో ఆ భూమిని రికార్డుల నుంచి మాయం చేశారని పేర్కొన్నారు.

అధికారికంగా ఉన్న 295 ఎకరాలు కాకుండా ఎలాంటి పత్రాలు లేని సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కంచె వేసి కలిపేసుకోవడం ద్వారా దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో భారీ సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులకు సరిగ్గా 30 రోజుల గడువును ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నెల రోజుల వ్యవధిలోగా పూర్తి స్థాయి విచారణ జరిపి, ఫాంహౌస్ వాస్తవ విస్తీర్ణం ఎంత, అందులో కలిసిన ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎంత అనే లెక్క తేల్చాలని ఆదేశించారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులతో పాటు బాధ్యులైన మంత్రులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో, రెవెన్యూ శాఖలో ప్రకంపనలు రేగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ క్షేత్రస్థాయి విచారణ మరియు తనిఖీల నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
[ Kcr Erravalli Farmhouse, CM Revanth reddy orders, Revenue department inspection, Telangana news, Gajwel rdo, Assigned Lands dispute, Minister Ponguleti Srinivas Reddy, TeluguOne News ]


