జగన్ కంచుకోటలో కూటమి జెండా.. కడపలో వైసీపీకి భారీ షాక్.!
Published on: Mon Nov 9, 2026 10:15AM
.webp)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్‌తో హోరాహోరీగా తలపడిన టీడీపీ.. ఒక దశలో ఆ పార్టీకి ధీటైన ఫలితాలు సాధించింది. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం పెరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్ కుటుంబానికి కడప జిల్లా రాజకీయంగా గట్టి మద్దతుగా నిలిచింది. దీంతో 2024 వరకు జిల్లాలో టీడీపీకి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు.
అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రాష్ట్రవ్యాప్తంగా విజయభేరి మోగించడంతో పాటు కడప జిల్లాలోనూ రాజకీయ సమీకరణాలను మార్చగలిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలే దక్కాయి. వాటిలో పులివెందుల నుంచి వైఎస్ జగన్, బద్వేల్ నుంచి డాక్టర్ సుధ విజయం సాధించారు.
2026 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి తన విజయ పరంపరను కొనసాగించింది. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు కడప జిల్లాలోని స్థానిక సంస్థలపై పట్టు సాధించింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరున్న ప్రాంతంలోనే కూటమి పన్నిన వ్యూహం ఫలించింది. రాజకీయంగా జగన్‌కు పులివెందుల నుంచే గట్టి సమాధానం ఇవ్వాలన్న కూటమి లక్ష్యం నెరవేరినట్లయింది. ఈ విజయాన్ని కుప్పం రిటర్న్ గిఫ్ట్‌గా అభివర్ణించే రాజకీయ వర్గాలూ ఉన్నాయి.
అయితే ఎన్నికల నిర్వహణ తీరుపై వస్తున్న ఆరోపణలు, విమర్శలు ఒకవైపు ఉంటే.. ఫలితాల పరంగా మాత్రం కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కేవలం అసెంబ్లీ ఎన్నికల విజయంతో సరిపెట్టుకోకుండా స్థానిక సంస్థల్లోనూ పట్టు సాధించడం కూటమి రాజకీయ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది.
జెడ్పీటీసీల్లో కూటమి క్లీన్‌స్వీప్ దిశగా..!
కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన జిల్లా పరిషత్ స్థానాలపై కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలకు గానూ టీడీపీ ఏకగ్రీవంగా 19, ఎన్నికల్లో 12 స్థానాలు కలిపి మొత్తం 31 స్థానాలను కైవసం చేసుకుంది.
కూటమిలోని జనసేన రెండు స్థానాలను ఏకగ్రీవంగా, మరో స్థానాన్ని ఎన్నికల్లో గెలుచుకుంది. బీజేపీ మూడు స్థానాలను ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. దీంతో మూడు పార్టీలు కలిపి మొత్తం 37 జెడ్పీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. వైసీపీ మాత్రం కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. జగన్ సొంత జిల్లాలో వైసీపీకి ఎదురైన ఈ ఫలితం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఎంపీటీసీల్లోనూ అదే జోరు.!
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 406 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఏకగ్రీవంగా 287, ఎన్నికల్లో 26 కలిపి 313 స్థానాలను గెలుచుకుంది.
జనసేన 19 స్థానాలను ఏకగ్రీవంగా, మరో ఐదు స్థానాలను ఎన్నికల్లో గెలిచి మొత్తం 24 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 27 స్థానాలను ఏకగ్రీవంగా, మరో ఏడు స్థానాలను ఎన్నికల్లో గెలిచి మొత్తం 34 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
మూడు కూటమి పార్టీలు కలిపి 371 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైసీపీ 14 స్థానాలను ఏకగ్రీవంగా, మరో 12 స్థానాలను ఎన్నికల్లో గెలిచి మొత్తం 26 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు 13 స్థానాలను దక్కించుకున్నారు. ఈ గణాంకాలు జిల్లాలో కూటమి ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందో స్పష్టం చేస్తున్నాయి.
పురపోరులోనూ కూటమిదే పైచేయి.!
మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి తన జోరును కొనసాగించింది. కడప జిల్లాలోని ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాజంపేట ప్రాంతాల్లోనూ కూటమి పార్టీలే మెజారిటీ స్థానాలను దక్కించుకున్నాయి.
మొత్తం 345 డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 296 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 28, జనసేన 9, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. వైసీపీ మాత్రం కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. దీంతో మున్సిపల్ పోరులోనూ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
2029లోనూ ఇదే జోరు సాధ్యమేనా.?
వైఎస్ కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టున్న పులివెందులలోనే కాకుండా.. జగన్ సొంత జిల్లా కడపలోనూ స్థానిక సంస్థలపై కూటమి పట్టు సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో కూటమి సాధించిన ఆధిపత్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
అయితే ఈ విజయ పరంపరను 2029 సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించడం కూటమికి అంత సులభం కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల బలం, అధికార పార్టీ ప్రభావం ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. నామినేషన్ల సమయంలో ప్రత్యర్థులను అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న ఘటనలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు వినిపించాయి. దీంతో ఈ ఫలితాలను విశ్లేషించేటప్పుడు ఎన్నికల నిర్వహణ తీరును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని కేవలం అధికార బలంగా కాకుండా ప్రజామోదంగా మార్చుకోవడం కూటమికి అసలైన సవాలు. అదే సమయంలో సొంత జిల్లాలో ఎదురైన ఘోర పరాజయంపై వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్థానిక ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలు 2029లోనూ పునరావృతమవుతాయా? ప్రజల మద్దతుతోనే ఈ ఫలితాలు వచ్చాయా? లేక స్థానిక రాజకీయ సమీకరణాలు, అధికార ప్రభావం కూడా పనిచేశాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదేమైనా జగన్ సొంత జిల్లాలో కూటమి సాధించిన ఈ ఆధిపత్యం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
ఇది కూడా చదవండి: Cyberabad: ఇక ఇల్లు, ఆఫీసు మాత్రమే కాదు.. పార్కుల్లోనూ ఉద్యోగం.. వర్క్ ఫ్రం పార్క్‌కు శ్రీకారం.!
[ Kadapa Politics, YS Jagan Mohan Reddy, TDP Alliance, Telugu Desam Party, YSRCP, Jana Sena, BJP, Pulivendula, Kadapa Local Body Elections, ZPTC Elections, MPTC Elections, Municipal Elections, Kadapa Corporation, Local Body Election Results, Andhra Pradesh Politics, 2029 Elections ]


