ఫేక్ ఉద్యోగం.. నకిలీ పే స్లిప్పులు.. బ్యాంకుకు రూ.30 లక్షల టోకరా.!
Published on: Wed Nov 11, 2026 1:48PM

ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు. ఆధార్, పాన్ కార్డులను సైతం ఫోర్జరీ చేసి బ్యాంకు అధికారులను నమ్మించారు. ఇలా పక్కా స్కెచ్‌తో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ నుంచి ఏకంగా రూ.30 లక్షల రుణం పొందిన ముఠా బాగోతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సాధారణంగా బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం పొందాలంటే ఉద్యోగం, నెలవారీ ఆదాయం, గుర్తింపు పత్రాలు కీలకం. అయితే ఈ నిబంధనలనే తమ మోసానికి అవకాశంగా మలుచుకున్నారు నిందితులు. సుమిక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీలుగా వ్యవహరిస్తున్న రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో గంటల శంకర్ అనే వ్యక్తిని బెంగళూరులోని ప్రముఖ కాప్‌కో టెక్నాలజీస్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించేలా నకిలీ నియామక పత్రాలు, పే స్లిప్పులు సృష్టించారు. అంతేకాకుండా ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డులను కూడా సిద్ధం చేశారు. ఈ నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించిన నిందితులు ఐసీఐసీఐ బ్యాంకులో శంకర్ పేరుతో ఏకంగా రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారంలో రుణం మంజూరయ్యేందుకు సహకరించినందుకు రామావత్ సురేష్‌కు రూ.6.70 లక్షలు కమీషన్‌గా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, శంకర్ పేరు మీద జారీ అయిన క్రెడిట్ కార్డును ఉపయోగించి మరో రూ.3 లక్షల వరకు షాపింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అయితే రుణ చెల్లింపుల్లో తేడాలు రావడం, బ్యాంకు అంతర్గత తనిఖీలు చేపట్టడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు, రామావత్ సురేష్, గంటల శంకర్, గంటల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా ఇదే తరహాలో మరిన్ని బ్యాంకులను మోసం చేసిందా? నకిలీ పత్రాల తయారీలో ఇంకా ఎవరైనా సహకరించారా? ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేకుండానే ఉద్యోగం ఉన్నట్లు.. జీతం లేకుండానే భారీ ఆదాయం వస్తున్నట్లు నమ్మించి బ్యాంకుకే బురిడీ కొట్టించిన ఈ ముఠా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!
[ ICICI Bank Fraud, Ibrahimpatnam Crime, Fake Salary Slips, Fake Aadhaar Card, Personal Loan Fraud, Telangana Police ]


