ఒక్కో యువతికి 30 వేలు ఆశ చూపి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో నయా దందా.!
Published on: Sat Oct 31, 2026 7:54PM

గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కలకలం రేపిన ఒక ఘటనలో, పేరుకు లేడీస్ హాస్టల్ ముసుగులో సాగుతున్న భారీ అండాల అక్రమ దందా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతమైన బేగంపేట ప్రకాశ్‌నగర్ పరిధిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బేగంపేట పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అర్థరాత్రి సమయంలో నిర్వహించిన ఈ సోదాల్లో అక్కడ నివసిస్తున్న సుమారు 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ప్రాథమిక విచారణలో పట్టుబడిన వారంతా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద యువతులుగా గుర్తించారు. గత ఏడాది కాలంగా ప్రకాశ్‌నగర్‌లోని ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో ఈ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతున్నట్లు స్థానికులు పోలీసుల ద్వారా తెలుస్తోంది. పేదరికంలో మగ్గుతున్న యువతులను టార్గెట్ చేస్తూ, వారికి మాయమాటలు చెప్పి ఈ అక్రమ రనాలోకి లాగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఒక్కో యువతికి సుమారు రూ. 30,000 వరకు నగదు ఆశ చూపి, వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసి నిబంధనలకు విరుద్ధంగా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ ఈ దందాను నడిపిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

కనీస వైద్య సదుపాయాలు లేని సాధారణ అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి సంక్లిష్టమైన వైద్య ప్రక్రియలను నిర్వహించడం పట్ల నిపుణులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతిలో సేకరించిన అండాలను (Eggs), సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు చికిత్స అందించే నగరంలోని ప్రముఖ ఫెర్టిలిటీ (Fertility) కేంద్రాలకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం మహిళల అండాలే కాకుండా, పురుషుల వీర్యకణాలను (Sperm) కూడా అక్రమంగా సేకరించి సరఫరా చేస్తున్నారనే మరో కోణంలోనూ పోలీసులు కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం రాకెట్ వెనుక ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ దందా వెనుక ఏయే సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధాలున్నాయి, దీని వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో బేగంపేట పోలీసులు తదితర బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి
[ hyderabad egg donation racket, begumpet police raid, illegal fertility scam, sot raid hyderabad, ivf egg trade scandal, girls hostel illegal activities, Hyderabad police, CP Sajjnar, DGP C.V. Anand ]


