TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..!

Published on: Tue Sep 29, 2026 9:33AM

 గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..!

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే..

చురుగ్గా ఉండటం..

బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది.

ఆహారం..

 బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది.

కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..

 వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం..

ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

                                 *రూపశ్రీ.