TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిర్యానీ ఆలస్యమైందని అడిగితే.. కత్తులతో దాడి.!

Published on: Tue Nov 10, 2026 3:15PM

యువకులపై హోటల్ సిబ్బంది, యాజమాన్యం అనుచరుల దాడి.!

నలుగురు స్నేహితులు కలిసి సరదాగా బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లారు. కాసేపు మాట్లాడుకుంటూ, భోజనం చేసి ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నారు. కానీ వారికి అక్కడ ఎదురైన అనుభవం మాత్రం జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. బిర్యానీ రావడం ఆలస్యమైందని అడిగినందుకు కత్తులతో దాడి చేస్తారని వారు ఊహించి ఉండరు. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మిధాని కాలనీకి చెందిన రమేష్ గౌడ్, మల్లేష్, శివ, రాకేష్ కలిసి బీఎన్‌రెడ్డి నగర్‌లోని అతిథి బిర్యానీ సెంటర్‌కు వెళ్లారు. నలుగురూ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఎంతసేపటికీ ఆర్డర్ రాకపోవడంతో.. బిర్యానీ తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకవుతోందని హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అక్కడితో విషయం సర్దుకుపోతుందని భావించారు. కానీ చిన్నపాటి ప్రశ్న కాస్తా మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

ఈ క్రమంలో హోటల్ సిబ్బంది, యువకుల మధ్య ఘర్షణ మొదలైంది. ఇంతలో హోటల్ యాజమాన్యం అనుచరులు కూడా అక్కడికి చేరుకుని యువకులపై దాడికి దిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాటలతో మొదలైన వివాదం కాస్తా కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. విచక్షణ కోల్పోయిన దుండగులు యువకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మల్లేష్ కనుబొమ్మతో పాటు వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

కత్తులతో దాడి.. బీరు బాటిళ్లతో బెదిరింపులు.!

కత్తులతో దాడి చేయడమే కాకుండా బీరు బాటిళ్లతో బెదిరిస్తూ చంపేస్తామంటూ హంగామా సృష్టించినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. బిర్యానీ కోసం హోటల్‌కు వచ్చిన యువకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తమ వద్ద ఉన్న రూ.25 వేల నగదుతో పాటు సెల్‌ఫోన్లు కూడా కనిపించడం లేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రిలో బాధితులు.. పోలీసుల దర్యాప్తు.!

దాడిలో గాయపడిన వారిని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మల్లేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారి వివరాలు, ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

బిర్యానీ ఆలస్యమైతే మరోసారి అడగొచ్చు.. లేదా ఆర్డర్ రద్దు చేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ అంతమాత్రానికే కత్తులు చేతబట్టి దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? హోటల్‌కు భోజనం చేయడానికి వెళ్లినవారికి ప్రాణభయం కలిగించే పరిస్థితులు ఎందుకు రావాలి? చిన్నపాటి సహనం లేకపోతే ఇలాంటి దాడులు ఎక్కడికి దారితీస్తాయి? బిర్యానీ కోసం వెళ్లిన యువకులకు చివరకు ఆసుపత్రే దిక్కయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఒక రహస్యం.. మరో బాలుడి జీవితాన్ని బలితీసుకుంది.!

 

[ Hotel staff attacked with knives when asked about the delay in biryani, Hyderabad Crime, BN Reddy Nagar, Athithi Biryani Centre, Biryani Hotel Attack, Knife Attack, Vanasthalipuram Police, Ramesh Goud, Mallesh, Hyderabad News, Hotel Staff Attack, Telangana Crime News ]