నూడుల్స్ తిని ఐదుగురు మృతి.. కేసులో ఊహించని ట్విస్ట్.!
Published on: Sun Oct 18, 2026 3:34PM

ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తొలుత నూడుల్స్, టీ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని భావించినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల కోణాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ పెద్దే భార్యాపిల్లలకు విషపదార్థం ఇచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడా పరిధిలోని రబుపురా ప్రాంతంలోని నాగ్లా శ్రీ పదం గ్రామంలో మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి ముగ్గురు పిల్లలు లడ్డూ (11), మిష్టి (7), సాక్షాత్ (3) నివసిస్తున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు, బంధువులు వెళ్లి చూడగా.. కుటుంబంలోని ఐదుగురూ విగతజీవులుగా కనిపించారు. ఈ దృశ్యం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు స్థానికంగా జరిగిన జాతరకు వెళ్లి తిరిగి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత నూడుల్స్, టీ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తొలుత ఆహారం కలుషితం కావడం వల్లే ఐదుగురూ ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానించారు. అయితే, ఘటనాస్థలంలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించడంతో కేసులో కొత్త కోణాలు బయటపడ్డాయి.
మహేశ్ ఫోన్లో రికార్డు చేసిన ఆడియో నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన కుటుంబం ఈ పరిస్థితికి రావడానికి తన ఇద్దరు సోదరీమణులు, బావమరిది కారణమని మహేశ్ ఆరోపించినట్లు సమాచారం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆడియో నోట్లోని ఆరోపణల ఆధారంగా సంబంధిత ముగ్గురిపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, కుటుంబ సభ్యుల మరణాల వెనుక విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేశే భార్యాపిల్లలకు ఆహారంలో విషపదార్థం కలిపి ఇచ్చి, అనంతరం తానూ తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అనుమానాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. మరణాలకు సంబంధించిన అన్ని కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల అనంతరం, మరణాలకు కచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు విసెరా నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఆహార భద్రతా అధికారులు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆహార పదార్థాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే విషప్రయోగం జరిగిందా? మరణాలకు కారణమైన పదార్థం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, మహేశ్తో పాటు ఇంట్లో నివసిస్తున్న ఆయన వృద్ధ తల్లి ఆ రాత్రి భోజనం చేయకపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, అందులో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఆస్తి వివాదాలు ఈ దారుణానికి కారణమయ్యాయా? లేక ఘటన వెనుక మరేదైనా కోణం ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి ఫోరెన్సిక్ నివేదికపైనే ఉంది.
[ Greater Noida Deaths, Rabupura Incident, Family Death Mystery, Suspected Poisoning, Property Dispute, Forensic Report, Uttar Pradesh Crime, Mahesh Family Case ]


